Telangana Farmers : తెలంగాణలో వానా కాలం పంట(ధాన్యం)ను ప్రభుత్వానికి అమ్ముకున్న రైతుల్లో కొందరికి ఇంకా సొమ్ములు అందక ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం మీద కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ రూ.2,626 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. ఈ సొమ్ము పంపిణీ కోసం బ్యాంకుల నుంచి రుణం కోసం సంస్థ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. వానాకాలం సీజనులో ఇప్పటి వరకు 68.26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆ ధాన్యం విలువ రూ. 13 వేల కోట్లను దాటింది. ఇప్పటి వరకు రూ. పది వేల కోట్లకు పైగా చెల్లింపులు పూర్తి చేశారు. నిధులు నిండుకోవటంతో మిగిలిన మొత్తం చెల్లించేందుకు అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
monsoon crops payment delay in Telangana : మరోపక్క చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండటంతో రైతులు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలను ఆశ్రయిస్తున్నారు. వారు అధికారులకు ఫోన్లు చేసి త్వరగా చెల్లింపులు చేయాలని సూచిస్తున్నారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో రూ. 294 కోట్లు రైతులకు చెల్లించాలి. ఖమ్మం జిల్లాలో రూ. 200 కోట్లు, ములుగు జిల్లాకు రూ.195 కోట్లు ఇలా అన్ని జిల్లాల్లో ధాన్యం రైతులు చెల్లింపుల కోసం ఎదురు చూస్తున్నారు. మరోపక్క భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) నుంచి వస్తున్న కొద్దిపాటి మొత్తాన్ని చెల్లింపులకు సర్దుబాటు చేస్తున్నా అది నామమాత్రంగానే ఉందని అధికారులు అంగీకరిస్తున్నారు.
కొనుగోళ్లు వివరాలు..
ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం - 68.26 లక్షల మెట్రిక్ టన్నులు
కొనుగోలు చేసిన ధాన్యం విలువ - రూ. 13,358 కోట్లు
ఇప్పటి వరకు చెల్లించిన మొత్తం - రూ. 10,732 కోట్లు
చెల్లించాల్సిన మొత్తం - రూ. 2,626 కోట్లు