దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు.. పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే మొదలుపెట్టగా, మరికొన్ని ఎప్పటి నుంచి తెరవాలో నిర్ణయం తీసుకున్నాయి. తెలంగాణలో సైతం ఓ నిర్ణయానికి రావాలని పాఠశాల విద్యాశాఖ ఇటీవలే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఏ రాష్ట్రాల ప్రణాళిక ఎలా ఉందో అక్కడి విద్యా పరిశోధన, శిక్షణ మండళ్ల అధికారులు, విద్యాశాఖ కార్యదర్శులను సంప్రదించి వివరాలను తెలుసుకొని సమగ్ర నివేదికను అందజేసినట్లు తెలిసింది.
దశలవారీగా ప్రత్యక్ష తరగతులు..?
ఈనెల 1న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగ్గా.. అంతకు ముందు రోజు ఈ నివేదికను సమర్పించినట్లు సమాచారం. తెలంగాణలోనూ ఆగస్టు 15 తర్వాత దశలవారీగా ప్రత్యక్ష తరగతులను మొదలుపెట్టాలని నివేదికలో పాఠశాల విద్యాశాఖ అభిప్రాయపడినట్లు తెలిసింది. ఈ అంశంపై మంత్రివర్గం చర్చించి ఓ నిర్ణయానికి వస్తుందని భావించినప్పటికీ.. ఏ నిర్ణయం తీసుకోలేదని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.
రోజు విడిచి రోజు తగిన జాగ్రత్తలతో బడులు తెరవాలని తాజాగా విద్యపై పార్లమెంటరీ స్థాయి సంఘం కేంద్రానికి సిఫారసు చేసింది. మరోవైపు పలు రాష్ట్రాలు ఆ దిశగా ఇప్పటికే ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాయి.
ఏ రాష్ట్రంలో ఎలా...
ఏపీలో ఈనెల 16న పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభించనున్నారు. తమిళనాడులో సెప్టెంబరు 1 నుంచి... 9 నుంచి 12 తరగతుల వరకు 50 శాతం విద్యార్థులతో ప్రత్యక్ష తరగతులు మొదలుపెడతామని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. కర్ణాటకలోనూ 9 నుంచి 12 తరగతులకు ఈనెల 23 నుంచి ఆఫ్‌లైన్ తరగతులు జరగనున్నాయి. విద్యార్థులను రెండు బ్యాచ్‌లుగా విభజించి రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించనున్నారు. మహారాష్ట్రలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ నెల 17న ప్రత్యక్ష తరగతులు మొదలుపెట్టాలని సర్కారు నిర్ణయించింది.
దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో విద్యాసంస్థలు తెరుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని, ఇక్కడా ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. రాష్ట్రంలో కంటే ఎక్కువ కేసులు ఉన్న చోట్లే బడులను తెరిస్తే.. ఇక్కడ ఏ కారణం వల్ల తెరవడం లేదన్న ప్రశ్న తలెత్తుతుందని చెబుతున్నారు.
ఇదీచూడండి: