తెలుగు మహిళ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల్లో 40 శాతం పదవులను అధినేత చంద్రబాబు బీసీలకు కేటాయించారు. లోక్‌సభ నియోజకవర్గాల తెలుగు మహిళ అధ్యక్షులుగా నియమితులైనవారిలో మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, కాకినాడ మేయర్ సుంకర పావని తదితరులున్నారు. రాజేశ్వరిని అరకు, పావనిని కాకినాడ లోక్‌సభ నియోజకవర్గాల తెలుగు మహిళ అధ్యక్షులుగా నియమించారు. గుంటూరుకి పార్టీ సీనియర్ నాయకుడు అన్నాబత్తుని శ్రావణ్ సతీమణి జయలక్ష్మిని నియమించారు. ఆమె తెనాలి వైకాపా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌కి వదిన. తెలుగు మహిళ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల నియామకంలోనూ బీసీలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. మొత్తం 50 పదవుల్లో 20 వారికి కేటాయించారు.
అధ్యక్ష పదవుల్లో బీసీలకు 8, ఎస్సీలకు 1, ముస్లిం మైనారిటీలకు 2, ఎస్టీలకు ఒకటి కేటాయించారు. ప్రధాన కార్యదర్శి పోస్టుల్లో బీసీలకు 12, ఎస్సీలకు 6, ముస్లిం మైనారిటీలకు ఒకటి, ఎస్టీలకు ఒకటి ఇచ్చారు. తెలుగు మహిళ అధ్యక్ష, ప్రధాన కార్యర్శుల సగటు వయసు 43 ఏళ్లని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా వ్యతిరేక విధానాలపైనా, వారు ఎదుర్కొంటున్న సమస్యలపైనా తెదేపా మహిళా విభాగం పోరాడుతుందని రాష్ట్ర అధ్యక్షురాలు అనిత తెలిపారు. తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మహిళలకు రాజకీయాల్లో సముచిత ప్రాధాన్యం కల్పిస్తే, దాన్ని చంద్రబాబు కొనసాగిస్తూ వారిని మరింత సమున్నత స్థానానికి తీసుకెళ్లారని ఆమె కొనియాడారు. వైకాపా పాలనలో మహిళలకు ప్రాధాన్యత తగ్గిపోతోందని విమర్శించారు.
ఇదీ చదవండి: