పలు జిల్లాల్లోని తెదేపా నాయకులు, కార్యకర్తలు.. ధర్మ పరిరక్షణ దీక్షలు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నా సీఎం జగన్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆలయాలపై దాడులను అరికట్టాలని నినాదాలు చేశారు.
కృష్ణా జిల్లాలో...
![tdp state wide dharma parirakshana deekshalu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10338427_mylavaram.jpg)
కృష్ణాజిల్లా మైలవరంలో నూజివీడు రోడ్డులోని మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాల వద్ద.. మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధర్మ పరిరక్షణ దీక్ష చేపట్టారు. ఆలయాలపై జరుగుతున్న దాడులు.. మతసామరస్యానికి తూట్లు పొడుస్తూ, హిందువుల మనోభావాలని దెబ్బతీస్తున్నా సీఎం జగన్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థల్ని లెక్కచేయకుండా అధికారముందనే అహంకారంతో వ్యవహరిస్తున్నారన్నారు. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో పరాభవం తప్పదని హెచ్చరించారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న టీఎన్ఎస్ఎఫ్ నాయకుల్ని అక్రమంగా నిర్బంధించడాన్ని ఖండించారు.
![tdp state wide dharma parirakshana deekshalu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10338427_mtm.jpg)
ప్రజాస్వామ్య విరుద్ధమైన పాలన విడిచిపెట్టి రాష్ట్ర అభివృధి కోసం చర్యలు చేపట్టకుంటే.. వైకాపా ప్రభుత్వం తగు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారయణరావు హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అధర్మపాలన, కక్షపూరిత చర్యలను నిరసిస్తూ.. మచిలీపట్నంలోని పార్టీ కార్యాలయం వద్ద వారు ధర్మ పరిరక్షణ దీక్ష చేపట్టారు. తాము అధికారంలో ఉన్నప్పుడు న్యాయబద్ధంగా వ్యవహరించాము కాబట్టే యాత్రల పేరుతో జగన్ రాష్ట్రమంతా తిరగారని అన్నారు. కుట్రపూరిత రాజకీయాలతో తెదేపా శ్రేణులను అకారణంగా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు.
విశాఖ జిల్లాలో...
![tdp state wide dharma parirakshana deekshalu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10338427_vsp.jpg)
చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు విశాఖ జిల్లా తగరపువలసలో.. పార్టీ శ్రేణులు హిందూ ధర్మ పరిరక్షణ దీక్ష నిర్వహించారు. రాజ్యాంగ విలువల్ని కాపాడాలంటూ.. అంబేడ్కర్ విగ్రహానికి తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోరాడ రాజబాబు, రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు వినతిపత్రం అందజేశారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని నినదించారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ విధానాలను విమర్శించారు. రాజ్యాంగేతర శక్తులను సమాజానికి దూరం చేయాలన్నారు.
అనంతపురం జిల్లాలో...
![tdp state wide dharma parirakshana deekshalu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10338427_atp.jpg)
దేవాలయాలపై జరుగుతున్న దాడులను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ.. ధర్మ పరిరక్షణ పేరుతో తెదేపా శ్రేణులు అనంతపురం జిల్లా హిందూపురంలో నిరసన చేపట్టారు. వైకాపా అధర్మ పాలన నశించాలంటూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మత సామరస్యాన్ని కాపాడాలని తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
విజయనగరం జిల్లాలో...
![tdp state wide dharma parirakshana deekshalu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10338427_vzm.jpg)
తెదేపా చేపట్టాలనుకున్న ధర్మ పరిరక్షణ యాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. ఆ పార్టీ నాయకులు ర్యాలీ చేపట్టారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ శ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు.. ఈ మేరకు ఆర్డీవో కార్యాలయానికి వినతి పత్రం సమర్పించారు. తెదేపా యాత్రకు రాష్ట్ర ప్రభుత్వం ముందు అనుమతి ఇచ్చి తర్వాత రద్దు చేయడం సరైంది కాదని అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడుతో పాటు ఇతర నాయకులను గృహనిర్బంధం చేయడం అమానుషమన్నారు. రాష్ట్రంలో సుమారు 125 హిందూ ఆలయాలపై దాడులు జరిగినా.. వాటిని నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. హిందూ ధర్మాన్ని, దేవాలయాలను ప్రజలందరూ కలిసి పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో...
![tdp state wide dharma parirakshana deekshalu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10338427_sklm.jpg)
రాష్ట ప్రభుత్వం నిరకుంశ పాలనపై.. శ్రీకాకుళం జిల్లా తెదేపా కార్యాలయం వద్ద ధర్మ పరిరక్షణ దీక్ష చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మిదేవితో పాటు ఇతర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవాలయాలపై దాడులు చేస్తున్న వారిని శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. హిందూ దేవుళ్లకు రాష్ట్రంలో రక్షణ లేకుంటా పోయిందని ఆరోపించారు. రామతీర్థం ఘటనకు కారకులను వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా క్రైస్తవ సంఘాల ర్యాలీ