రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్ దిగజార్చారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు మండిపడ్డారు. అమ్మఒడి, వసతి దీవెన, విద్యాదీవెన పథకాల ద్వారా ఒక్కో విద్యార్థికి ఏడాదికి లక్షా 50 వేల రూపాయలు ఇస్తానని జగన్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుతం ఈ మూడు పథకాల ద్వారా కేవలం రూ.70 వేలు మాత్రమే ఇస్తూ.. రూ.80 వేలు కోత పెట్టడం మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు.
దీన్ని కప్పిపుచ్చేందుకే జాతీయ మీడియాలో పెద్ద ప్రకటనలతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ.. గత ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఒక్క ఫీజు రీయంబర్స్‌మెంట్‌కే రూ.16 వేల కోట్లు ఖర్చు పెట్టారని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.2,400 కోట్లు చెల్లించారని వివరించారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు చంద్రబాబు ప్రభుత్వం 45 వేలు ఇస్తే, దాన్ని జగన్ 35 వేలకు తగ్గించింది వాస్తవం కాదా అని నిలదీశారు.
అమ్మఒడి పథకానికి 60 లక్షల మంది అర్హులుంటే… వైకాపా ప్రభుత్వం 43 లక్షల మందికే కుదించిందని కళా దుయ్యబట్టారు. చంద్రబాబు రెండు డీఎస్సీలు జరిపి 17 వేల మంది ఉపాధ్యాయులను నియమిస్తే… యూనివర్శిటీ పాలకమండళ్ల నియామకంలో సీఎం జగన్ సామాజిక న్యాయాన్ని మంటగలిపారని కళా వెంకట్రావు మండిపడ్డారు.
ఇదీ చూడండి..