మూడు ప్రాంతాల్లో 3 రాజధానులు ఏర్పాటు చేసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించడంపై... తెదేపా తీవ్రంగా మండిపడింది. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూనే... అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని డిమాండ్ చేసింది. రాజధానిపై సీఎం జగన్ ప్రకటన తర్వాత... పార్టీ ముఖ్యనేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు.
సీఎం ప్రకటన మైండ్‌గేమ్‌లో భాగమేనన్న చంద్రబాబు... అమరావతిపై కోపాన్ని ఈవిధంగా తీర్చుకుంటున్నారని అన్నారు. రాజధానికి రూపాయి పెట్టుబడి అవసరం లేదని ఎన్నోసార్లు చెప్పామని గుర్తుచేశారు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తే... ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందనే తప్పుడు ఆరోపణలతో రాజధానినే చంపడానికి సిద్ధమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
13 జిల్లాల చిన్న రాష్ట్రంలో మళ్లీ ప్రాంతీయ విద్వేషాలు వద్దంటూ... అమరావతిని రాజధానిగా గతంలో స్వాగతించిన జగన్... ఇప్పుడు చెలగాటమాడుతున్నారని తెదేపా నేతలు మండిపడ్డారు. అమరావతిని చంపేసి, హైదరాబాద్‌లో ఉన్న తన భూముల ధరలు పెంచుకునేందుకే... జగన్ ఈ తరహా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ ఏకపక్ష విధానాలు విడనాడి, భవిష్యత్ తరాల బాగుకోసం అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని నేతలు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ...