కృష్ణా జిల్లాలో..
- రైతుల ప్రయోజనాలు కాపాడేలా వైకాపా ప్రభుత్వం వ్యవహరించట్లేదని తెదేపా నేతలు విమర్శించారు. కృష్ణా నికర జలాలను సముద్రం పాలు చేస్తున్నారంటూ ప్రకాశం బ్యారేజీ వద్ద నిరసన చేపట్టిన తెదేపా నేతలు.. రైతులకు ఇవ్వాల్సిన నీళ్లు సముద్రంపాలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. జల వివాదాలపై లేఖలు రాస్తే సమస్య పరిష్కారమవుతుందా అని ప్రశ్నించారు. అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని జగన్ ఎందుకు డిమాండ్ చేయట్లేదని నిలదీశారు. కార్యక్రమంలో తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర, మాజీ మంత్రులు ఆలపాటి రాజా, నక్కా ఆనంద్‌బాబు, గుంటూరు పార్లమెంట్ తెదేపా అధ్యక్షులు తెనాలి శ్రావణ్‌కుమార్, తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, పలువురు రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
- రైతులను ఏపీ ప్రభుత్వం మోసం చేస్తోందని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆరోపించారు. రైతులను దగా చేస్తూ రైతు దినోత్సవం నిర్వహించడం విడ్డూరమని ఆయన మండిపడ్డారు. రైతు దినోత్సవం జరుపుకొనే అర్హత వైకాపా ప్రభుత్వానికి లేదని అన్నారు. పంట గిట్టుబాటు ధర కల్పించడంలో సీఎం జగన్ వైఫల్యం చెందారని విమర్శించారు.
- వైఎస్సార్ జయంతిని ప్రభుత్వం రైతు దినోత్సవంగా నిర్వహిస్తోందని... కానీ ఇవాళ రైతు దగా దినోత్సవమని తిరువూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో రైతులు నినదించారు. రైతులను నట్టేట ముంచి రైతు దినోత్సవాలను నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ధాన్యాన్ని కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా ఇంతవరకు రైతుల ఖాతాల్లో నగదు జమచేయలేదని ఆవేదన వెలిబుచ్చారు.
గుంటూరు జిల్లాలో..
"రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న జగన్ రెడ్డి మెడలు వంచేందుకు అన్నదాతల తరఫున ఉద్యమిస్తాం" అని నర్సరావుపేట తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు హెచ్చరించారు. రైతుల్ని నట్టేట ముంచిన జగన్ రెడ్డి, ఏ ముఖం పెట్టుకుని రైతు దినోత్సవం జరుపుతారని ప్రశ్నించారు. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలోకి తీసుకెళ్లి 2ఏళ్లుగా వారిని నష్టాలపాలు చేయటం సిగ్గుచేటని విమర్శించారు. చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి 10లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని ఆంజనేయులు డిమాండ్‌చేశారు. గిట్టుబాటు ధర, ఇన్ పుట్ సబ్సిడీ, అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకుని తీరాలన్నారు. అప్పులు బాధలు తట్టుకోలేక కోనసీమలో రైతులు పంట విరామం ప్రకటించే దుస్థితి కల్పించారని మండిపడ్డారు. అక్కడి రైతులతో ప్రభుత్వం చర్చలు జరిపి తిరిగి పంటలు వేసేలా ప్రోత్సహించాలన్నారు. ఏపీ భూభాగంలో ఉన్న పులిచింతల ప్రాజెక్టులో విద్యుతుత్పత్తి తెలంగాణకు అప్పగించటం తగదని హితవు పలికారు. కేసీఆర్ స్వచ్ఛందంగా పులిచింతల విదుతుత్పత్తి ప్రాజెక్టును ఏపీకి అప్పగించాలని జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లాలో ..
రాయలసీమ రైతులకు నష్టం కలిగించే విధంగా... తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే.. ముఖ్యమంత్రి, మంత్రులు ఎందుకు స్పందించటం లేదని.. తెదేపా నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు పశ్నించారు. కర్నూలులో ఆయన మాట్లాడారు. శ్రీశైలం నుంచి నీటిని దిగువకు వదలటం ద్వారా ఆరు జిల్లాలు తీవ్రంగా నష్టపోతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ పోరాటానికి సిద్ధమని గుర్తు చేశారు. రైతులను నట్టేట ముంచి... రైతు దినోత్సవాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదని ఆరోపించారు.
తూర్పుగోదావరి జిల్లాలో..
ప్రత్తిపాడులో తెదేపా శ్రేణులు రైతు దగా దీక్ష నిర్వహించాయి. ఈ నిరసనల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల రాజా పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని ఆయన విమర్శంచారు. రైతులకు అన్యాయం చేస్తూ రైతు దీక్ష నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వం.. ధాన్యం కొనుగోలు చేసిన వారంలోగా డబ్బు చెల్లించేదని.. ధాన్యం కొనుగోలు చేసి నాలుగు నెలలు కావొస్తున్నా.. ఇప్పటివరకు రైతులకు నగదు ఇవ్వలేదన్నారు. మద్దతు ధరను 1800 నుంచి 1400కి తగ్గించారని మండిపడ్డారు.
ప్రకాశం జిల్లాలో...
కనిగిరి మండలం మాచవరం గ్రామంలో తెదేపా ఆధ్వర్వంలో రైతులు నిరసన తెలిపారు. రైతులను దగా చేస్తూ రైతు దినోత్సవాన్ని జరుపుతున్నారని... ఇవాళ రైతు దగా దినోత్సవమని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. పేరుకే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారని.. వాటి వల్ల ప్రయోజనం లేకుండా పోయిందన్నారు.
ఇదీ చదవండి: