చిత్తూరు జిల్లాలో రోజురోజుకు నిత్యావసర సరకులు, కూరగాయల ధరలు పెరుగుతుండటంతో సామాన్యుడి కళ్లల్లో నీళ్లు తెప్పిస్తున్నాయని తిరుపతి పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు నరసింహ యాదవ్ అన్నారు. కూరగాయల ధరల పెరుగుదలను నిరసిస్తూ.. తిరుపతిలోని బొంతాలమ్మ ఆలయం వద్ద ధర్నా నిర్వహించారు. కూరగాయలతో తయారు చేసిన మాలలను ధరించి వినూత్నంగా నిరసన చేపట్టారు. కిలో 100 రూపాయల వరకు కూరగాయల ధరలు ఉన్నాయని.. వైకాపా ప్రభుత్వం దళారీ వ్యవస్ధను ప్రోత్సహిస్తుందని ఆయన మండిపడ్డారు. వెంటనే కూరగాయల ధరలు తగ్గే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
సంక్రాంతిలోగా హౌస్ ఫర్ ఆల్ ఇళ్లను లబ్ధిదారులందరికీ ఉచితంగా ఇవ్వకుంటే.. వారితోనే కలిసి ఇళ్లను స్వాధీనం చేసుకుంటామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. హౌస్ ఫర్ ఆల్ ఇళ్లను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో తెలుగుదేశం పార్టీ మహా ధర్నా నిర్వహించింది.
కృష్ణా జిల్లా నందిగామ మండలం మునగచర్ల గ్రామంలో పసుపు చైతన్యం కార్యక్రమంలో భాగంగా గ్రామమంతా నీటి సమస్యను వెంటనే పరిరక్షించాలని గ్రామ మహిళలు నిరసన చేపట్టారు. మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య, పలువురు తెదేపా నాయకులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. మునగచర్ల గ్రామంలో 2 నెలల నుంచి తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారని తంగిరాల సౌమ్య తెలిపారు. అధికారులు కనీసం గ్రామ ప్రజలకు నీరు అందించకుండా చోద్యం చూడటం సరికాదని హితవు పలికారు. ప్రతి రోజు గ్రామమంతా మంచి నీటి ట్యాంకర్ల ద్వారా ప్రజల దాహార్తిని తీర్చాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: రైలు కింద పడి కుటుంబం ఆత్మహత్య.. నలుగురు మృతి