ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ప్రజాభిప్రాయం కోరుదామని తాను విసిరిన సవాల్‌ను ప్రభుత్వం స్వీకరించకపోవటం వల్ల తెదేపా అధినేత చంద్రబాబు.. ఓ ప్రత్యేక వెబ్ సైటు ద్వారా ప్రజాభిప్రాయాన్ని కోరారు. ఈ వెబ్సైట్ ద్వారా ఓటు వేసి అమరావతిని రక్షించుకోండని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రజలు అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధితో పాటు అమరావతిని ఏకైకా రాజధానిగా కోరుకుంటున్నారా అనే ప్రశ్నను అందులో ఉంచారు. www.apwithamaravati.com అనే చిరునామాతో తీసుకొచ్చిన ఈవెబ్ సైట్లో రాజధాని విషయమై ప్రజాభిప్రాయం కోరారు. వెబ్సైట్ అందుబాటులోకి తెచ్చిన 24గంటల్లోపే దాదాపు 2లక్షల మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఓటు వేసిన వారిలో 90శాతం మందికి పైగా అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
అమరావతికి సంబంధించిన అన్ని పత్రాలు, ఫోటోలూ ఈ వెబ్సైట్లో పొందుపరిచారు. అమరావతి చరిత్ర, రాజధానిగా ఈ ప్రాంతాన్నే ఎంచుకోవడానికి గల కారణాలు.. ఇందులో వివరించారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించే భవిష్యత్ రాజధానిగా అమరావతి నిర్మించబడుతుందని పేర్కొన్నారు. నవ్యాంధ్రాను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర నడిబొడ్డున, అన్ని వనరులతో స్వయం సమృద్ధిగా రూపొందించబడుతున్న నగరం అమరావతి అని వివరించారు.
అమరావతి ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర బిందువని వెబ్సైట్లో పేర్కొన్నారు. అమరావతి రాష్ట్రానికే కాకుండా.. దేశానికి అభివృద్ధి కేంద్రంగా చేయాలనే భవిష్యత్ లక్ష్యంతో, మూడు మెగా సిటీలు, పద్నాలుగు స్మార్ట్ సిటీలతో మన దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వినూత్నమైన ల్యాండ్ పూలింగ్ పథకంతో 26,839 మంది రైతులు చేతులు కలిపి తమ భూమిని త్యాగం చేశారని గుర్తుచేశారు. ఇది ఇప్పటివరకు అత్యంత స్వావలంబన కలిగిన నగరాల్లో ఒకటిగా మిగిలిపోయిందన్నారు
వెబ్సైట్లో పెట్టిన ప్రజాభిప్రాయానికి కొంత సమయం ఇచ్చి.. ఓటింగ్‌లో పాల్గొన్న వారి ప్రాంతాల వారీ వివరాలతో త్వరలో చంద్రబాబు మీడియా ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: మృతదేహం అప్పగింతకు లంచం డిమాండ్ చేసిన కామాటి సస్పెన్షన్