TDP MP: దేశంలో 10 రాష్ట్ర ప్రభుత్వాలు పరిమితికి మించి అప్పులు చేసి దివాలా అంచుకు చేరినట్లు ఆర్‌బీఐ నివేదికలో పేర్కొన్నందున అందులో ఒకటైన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని తెదేపా ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆదివారం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో వీరు పాల్గొన్నారు. కనకమేడల రవీంద్ర కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘ప్రైవేటు సంస్థలు దివాలా అంచుకు చేరినప్పుడు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వాటి పరిరక్షణకు ఎలా చర్యలు తీసుకుంటుందో అలాగే ఏపీ ఆర్థిక విషయాలపై దృష్టి సారించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. శ్రీలంక పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. అందువల్ల కేంద్రం సకాలంలో స్పందించి ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి. విభజన చట్టంలోని అంశాల అమలుకు చర్యలు తీసుకోవాలి. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచించాలి. రాజధాని అమరావతి నిర్మాణంపై శ్రద్ధపెట్టి పూర్తి చేయాలి. దీనిపై కోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా పనులు చేపట్టడానికి నిధులు సేకరిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు అఫిడవిట్ వేసింది. మరోవైపు రెండు నెలల్లో మూడు రాజధానుల బిల్లు తెస్తామని రాష్ట్ర మంత్రులు చెబుతున్నారు. కేంద్రం జోక్యం చేసుకొని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి. వరద బాధితులను ఆదుకోవాలి. రైల్వే జోన్ ఏర్పాటుచేయాలి. అఖిలపక్ష సమావేశంలో వైకాపా నాయకులు విభజన సమస్యలతో పాటు, ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించినా.. వాటిని సాధించేంత ఒత్తిడి కేంద్రంపై తీసుకురాలేదు’ అని విమర్శించారు.
ఇవీ చదవండి: