రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్‌ను తొలగించడాన్ని తెలుగుదేశం తప్పుపట్టింది. రాజ్యాంగ విరుద్ధంగా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ... ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలుగుదేశం తీవ్రంగా ఆక్షేపించింది. వ్యవస్థలను ధ్వంసం చేసే చర్యలు వైకాపా ప్రభుత్వం చేపడుతోందని ఆ పార్టీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఎన్నికల కమిషనర్‌నే తీసేస్తామని బెదిరించే పరిస్థితిలో స్వేచ్ఛాయుతంగా.. పారదర్శకంగా ఎన్నికలు ఎలా జరుగుతాయని అనుమానం వ్యక్తం చేశారు. స్వేచ్ఛాయుత ఎన్నికలే జరగకపోతే ప్రజాస్వామ్యానికి విలువ ఏం ఉంటుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని వైకాపా ప్రభుత్వం ఖూనీ చేస్తోందని ధ్వజమెత్తారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(కె) ప్రకారం ఎస్‌ఈసీని గవర్నర్ నియమిస్తారని... ఆయన్ని తొలగించే అధికారం పార్లమెంట్‌కు తప్ప ఎవరికీ లేదని యనమల గుర్తు చేశారు. హైకోర్టు జడ్జిని తొలగించే విధానమే ఎస్‌ఈసీ తొలగింపునకు వర్తిస్తుందన్నారు. లేని అధికారాన్ని చలాయించి ఎస్‌ఈసీ పదవీకాలం తగ్గించడం హేయమని చర్యగా ఆయన అభివర్ణించారు. వైకాపా ప్రభుత్వ చర్యలు 73, 74 రాజ్యాంగ సవరణలకు వ్యతిరేకంగా ఉన్నాయని... ఈసీ నిర్ణయాధికారాన్ని కోల్పోయేలా వైకాపా ప్రభుత్వం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 73, 74 రాజ్యాంగ సవరణలకు అనుగుణంగానే ఎవరైనా వ్యవహరించాలని... ఈసీ నియామకం, పదవీకాలంపై రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించిందన్నారు. పంచాయతీరాజ్ చట్టానికి ఏ సవరణలు చేసినా రాజ్యాంగ పరిధిలోనే జరగాలి తప్ప అందుకు భిన్నంగా జరగితే మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.
రమేశ్ కుమార్ ఏం తప్పు చేశారు?:అచ్చెన్నాయుడు
ఎన్నికల కమిషనర్‌గా రమేష్‌కుమార్‌ను తప్పించడాన్ని తెదేపా శాసనసభ పక్ష ఉపనేత అచ్చెన్నాయుడు ఖండించారు. రాజ్యంగబద్ధమైన పదవిని కూడా జగన్ శాసిస్తున్నారని దుయ్యబట్టారు. రమేష్ కుమార్ ఏం తప్పు చేశారని జగన్ ఆయనపై అంత కక్ష కట్టారని ప్రశ్నించారు. కరోనా విజృంభిస్తుంటే ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని స్థానికసంస్థల ఎన్నికలు వాయిదా వేయడమే రమేష్ కుమార్ చేసిన తప్పా ప్రశ్నించారు.
సరైన నిర్ణయమే నేరమా?: మాజీ మంత్రి సోమిరెడ్డి
సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని రాష్ట్రాన్ని కాపాడటమే ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ చేసిన నేరమా అని మాజీ మంత్రి సోమిరెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపిన అధికారులతో పాటు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఎస్ఈసీ పైనా కక్ష సాధింపులే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఎన్నికలు వాయిదా వేశారన్న కోపంతోనే ఎస్ఈసీ బాధ్యతల నుంచి రమేశ్ కుమార్ ను తొలగించారని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: