ముఖ్యమంత్రి జగన్ కనుసన్నల్లోనే దేవాలయాలపై దాడులు జరిగాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. అందువల్లే దాడులు జరిగిన ప్రాంతాలను సందర్శించలేదని దుయ్యబట్టారు. ప్రతిపక్ష పార్టీలు దేవాలయాలను ధ్వంసం చేసి పరిశీలనకు వెళ్తున్నాయని నెల్లూరు సభలో ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. చేతకాని తనాన్ని, అసమర్థతను ఇతర పార్టీల మీద పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.
వీడియో సందేశం ద్వారా మాట్లాడుతూ... "నెల్లూరు సభలో సీఎం జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. రేపు బడుల మీద దాడులు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనటం మీ తర్వాత లక్ష్యం బడులు మీదే అనే అనుమానం కలుగుతోంది. రాష్ట్రంలో ఏదో ఒక విధ్వంసం జరిగేతేనే మీకు నిద్ర పడుతుంది. మీ పరిపాలన ప్రాంరభమైంది కూడా విధ్వంసంతోనే. ప్రజా వేదిక కూల్చి ప్రజలు, కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టిన నీచ సంస్కృతి మీది. రాష్ట్రలో అధికారంలో ఉంది నువ్వే కాబట్టి దాడుల బాధ్యతా నీదే. 140 దాడులు జరిగితే ఒక్కసారి కూడా స్పందించ లేదు. ఎన్నికలకు అడ్డొచ్చిన కరోనా... సీఎం పుట్టిన రోజు వేడుకల నిర్వహణకు రాదా.... నీ దగాను ప్రజలు తెలుసుకున్నారు. ఇతర పార్టీలపై నీ తప్పులను పెట్టడం దారుణం. దేవాలయాలపై మొదటి దాడి జరినప్పుడే ఖండించి పోలీసులకు సరైన సూచనలు ఇచ్చివుంటే ఇన్ని సంఘటనలు జరిగేవి కాదు. ఏ ఆలయం, బడి మీద దాడి జరిగినా దానికి కర్త, కర్మ, క్రియ జగనే’’ అని వ్యాఖ్యానించారు.
పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే సీఎంకు నోటీసులు ఇవ్వాలి: వర్ల
ఆలయాలు ధ్వంసం చేసిన వారే దేవాలయ సందర్శనకు వెళ్తున్నారన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు వర్లరామయ్య మండిపడ్డారు. రథాలు తగలపెట్టిన వారు రథయాత్రలకు బయలుదేరతారని ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు సభలో మాట్లాడారన్న ఆయన... దాడుల సమాచారం సీఎం వద్ద ఉన్నందున ఆయనకు 91 సీఆర్పీసీ కింద డీజీపీ నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గతంలో తెదేపా అధినేత చంద్రబాబుకు, తనకు నోటీసులు జారీ చేసిన పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే సీఎంకూ నోటీసులు ఇచ్చి జగన్‌కు తెలిసిన నిజాలు బయట పెట్టించాలన్నారు. సీఎంకు నోటీసులు ఇవ్వకుంటే పోలీసులు విచారణ జరిపే తీరు సరైంది కాదని భావించాలన్నారు. ముఖ్యమంత్రి క్రైస్తవ సంఘాలను రెచ్చగొట్టి వారి ఔన్నత్యాన్ని తగ్గిస్తూ రోడ్డుపైకి పంపిస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయ లబ్ధి కోసం క్రైస్తవులను వాడుకుంటూ మతాల మధ్య అగాథం సృష్టించేందుకు యత్నిస్తున్నారని వర్ల ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి:
'19 నెలలుగా అంధకారంలో రాష్ట్రం... ప్రజలను యువత చైతన్యపరచాలి'