జగన్ అంటే వీరుడు.. సూరుడని చెప్పుకుంటున్న వైకాపా నేతలు ఏదైనా ఉంటే డైరెక్టుగా ఫైట్ చేయాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని సవాల్ విసిరారు. రోజూ కొట్టుకుంటూ ఏపీకి చెడ్డ పేరు తేవద్దని హితవు పలికారు. ఏపీలోని యువతను డ్రగ్స్‌కు బానిసలుగా చేయాలని వైకాపా నేతలు భావిస్తున్నారా అని నిలదీశారు. ఏపీలో పిల్లలను చదివించాలంటే డ్రగ్స్ బారిన పడతారేమోననే భయం తల్లిదండ్రుల్లో కన్పిస్తోందని మండిపడ్డారు. కేశినేని భవన్ నుంచి భారీ ర్యాలీగా ఎంపీ నాని... ఎన్టీఆర్ భవన్‌కు వచ్చి చంద్రబాబు దీక్షకు మద్దతు పలికారు. మద్య నిషేధం చేస్తానని జగన్ చెబితే.. వైకాపా నేతలే సారాకు రంగేసి మద్యం అమ్ముతున్నారని ఆరోపించారు. రేపనేది ఉంటుందని జగన్ గుర్తుంచుకోవాలన్న కేశినేని.., హిట్లర్, సద్దాం వంటి డిక్టేటర్లను చూశామని.. జగన్‌కు త్వరలో ప్రజలు బుద్ది చెబుతారని హెచ్చరించారు.
పట్టాభి ఎక్కడ సీఎం పేరును ప్రస్తావించలేదు: కూన రవి
అమరవీరుల సంస్మరణ దినం వేదిక పైనుంచి సీఎం బూతులు మాట్లాడారని తెదేపా నేత కూన రవి మండిపడ్డారు. పట్టాభి ఎక్కడా సీఎం జగన్ పేరును ప్రస్తావించలేదని ఆక్షేపించారు. సీఎం జగన్‌ను తిట్టకున్నా ఆయన్నే తిట్టారంటూ సీఎంకు ఆపాదించి, సీఎం మీదున్న కోపాన్ని సజ్జల తీర్చుకున్నారని కూన విమర్శించారు. తాము తిరగబడితే వైకాపా నేతలు తిరగలేరన్న కూన..పోలీసులు లేకుండా రావాలని సజ్జలకు సవాల్ విసిరారు. జనాగ్రహ దీక్షల పేరుతో వైకాపా నేతలతో దీక్షలు చేస్తున్నారని, జనం ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారని దుయ్యబట్టారు.
కొడాలి, పేర్ని, అనిల్ వంటి వారితో జగనే బూతులు మాట్లాడిస్తున్నారని కూన ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్ బూతుల సామ్రాట్ అని, రాష్ట్రానికి హెడ్డుగా ఉన్న జగన్ హెడ్ లేకుండా మాట్లాడారని ఆక్షేపించారు. ఈ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి, రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. నేతలతో బూతులు మాట్లాడిస్తున్న వైకాపా గుర్తింపు రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ ఈసీని కొరతామని స్పష్టం చేశారు.
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఒక్క సైగ చేస్తే రాష్ట్రం వణుకుతుందని తెదేపా సీనియర్ నేత వైవీబీ రాజేంద్రప్రసాద్ ధ్వజమెత్తారు. వైకాపాకు దమ్ము, ధైర్యం ఉంటే ఎవడు వస్తారో ఇప్పుడు రావాలని సవాల్ చేశారు. తెలంగాణ, ఛత్తీస్‌గడ్‌లకు ఏపీ నుంచి గంజాయి, హెరాయిన్ వస్తున్నాయని కేంద్ర నిఘా సంస్థలు చెప్పాయని.. అవంతికి ఈ రుజువులు చాలవా అని ప్రశ్నించారు.