మూడు రాజధానుల (Three Capitals Repeal Bill) చట్టం ఉపసంహరించి.. మెరుగైన బిల్లు తెస్తామని చెప్పడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని తెదేపా నేతలు మండిపడ్డారు. రాజధాని వ్యాజ్యాలపై హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురవుతుందని తెలిసే.. జగన్ కుట్ర రాజకీయాలు చేశారన్నారు. న్యాయం గెలుస్తుందనే భయంతోనే బిల్లు ఉపసంహరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మండి పడ్డారు. 180కి పైగా ప్రభుత్వ నిర్ణయాలను కోర్టులు తప్పుపట్టాయని గుర్తు చేసిన కనకమేడల.. అమరావతి రాజధానిని ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు.
మరో నాటకానికి తెర..
వికేంద్రీకరణ బిల్లును పూర్తి స్థాయిలో రద్దు చేయాలని తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ నేత కూన రవికుమార్‌తో కలిసి శ్రీకాకుళంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. వైకాపా సర్కార్ మదిలో ఏదైనా కుట్ర ఉందా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. ప్రజలను గందరగోళంలోకి నెట్టకుండా రాజధానిపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అమరావతి రాజధానిపై తెదేపా మొదటి నుంచి గట్టిగా పోరాడుతోందన్న రామ్మోహన్.. రైతుల పాదయాత్రకు వస్తున్న మద్దతు చూసి ప్రభుత్వం ఆలోచనలో పడిందన్నారు. రాజధాని అంశంపై జగన్ మరో నాటకానికి తెరలేపుతున్నారని ఆయన మండిపడ్డారు. అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించే వరకూ తెదేపా పోరాడుతుందన్నారు.
మరింత గందరగోళం..
మూడు రాజధానుల రద్దు నిర్ణయం.. తర్వాత సీఎం జగన్ ప్రకటన.. మరింత గందరగోళం సృష్టించాయని ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. మళ్ళీ మెరుగైన బిల్లు అంటూ సీఎం చేసిన ప్రకటనతో మరింత అనిశ్చితి నెలకొందన్నారు. అమరావతి వ్యాజ్యాలపై న్యాయస్థానంలో వాదనలు కొలిక్కి వస్తున్నాయన్న పయ్యావుల.. తీర్పు వచ్చే సమయం దగ్గర పడిందని అన్ని లెక్కలూ వేసుకునే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. గతంలో చేసిన చట్టాలు తప్పు అని సీఎం జగన్ అంగీకరించిన విషయం స్పష్టమైందన్నారు.
ప్రభుత్వ ప్రకటనలో కుట్ర కోణం..
రాజధాని వ్యాజ్యాలపై హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురవుతుందని తెలిసే.. జగన్ మూడు రాజధానుల చట్టం ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ప్రభుత్వ ప్రకటనలో కుట్ర దాగి ఉందన్న ఆయన.. తాత్కాలిక ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు. సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలతో పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ అంటేనే హడలిపోయే పరిస్థితి తలెత్తిందన్నారు.
పెద్దిరెడ్డి వ్యాఖ్యలు దారుణం..
వికేంద్రీకరణ చట్టం రద్దు ప్రకటనలో కుట్ర దాగి ఉందని తెదేపా ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి అన్నారు. చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు, అమరావతి రైతుల మహా పాదయాత్రను తప్పుదారి పట్టించేందుకే మూడు రాజధానుల రద్దు నిర్ణయం తీసుకున్నారన్నారు. మహాపాదయాత్ర చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టుల యాత్ర అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనటం దారుణమన్నారు.
వికేంద్రీకరణ అంటే విభజించడం కాదు..
వికేంద్రీకరణ అంటే విభజించడం కాదని తెదేపా సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్‌గజపతి రాజు అన్నారు. ప్రజలకు మేలు చేయాలనే యోచన ఈ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. 3 రాజధానులపై కోర్టు మొట్టికాయలు తప్పవనే సీఎం జగన్ వెనక్కి తగ్గారన్నారు. ఒక సమస్య పరిష్కారానికి మరో పెద్ద సమస్య సృష్టిస్తున్నారని ఆక్షేపించారు.
ఇదీ చదవండి
AP cabinet News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మూడు రాజధానుల చట్టం ఉపసంహరణ