TDP LEADER BONDA UMA ON YSRCP MP VIDEO: ఒక డర్టీ ఎంపీని కాపాడేందుకు ప్రభుత్వం వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తుంటే.. రాష్ట్రంలో మహిళలకు భద్రత ఎలా ఉంటుందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమ ప్రశ్నించారు. రాష్ట్ర పరువు మంటగలిపిన ఎంపీ గోరంట్ల మాధవ్ ని పోలీసులు, ప్రభుత్వం వెనకేసుకొస్తూ రోజుకో డ్రామా ఆడుతోందని మండిపడ్డారు. పార్లమెంట్ వ్యవస్థకు సంబంధించిన ఈ అంశంపై నిజనిజాలు నిగ్గు తేల్చే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని నిలదీశారు. అసలు వీడియో సంపాదించాల్సిన బాధ్యత పోలీసులదా లేక ప్రతిపక్షానిదా అని ప్రశ్నించారు. తాడేపల్లి ఆదేశాలు అనుసరించి ఎంపీని కాపాడేందుకే ఐపీఎస్‌లు అయ్యారా అని మండిపడ్డారు.
సునీల్ కుమార్ చట్టానికి అతీతుడు కాదని.. తమపై కేసులు పెడతామని బెదిరిస్తున్న సునీల్ కుమార్‌పై తాము కేసులు పెట్టగలమన్నారు. ఓ వైపు ప్రైవేట్ ల్యాబ్ నివేదికను పరిగణనలోకి తీసుకోమని చెప్తూనే, కేసు పెడతానని ఎలా అంటారని ధ్వజమెత్తారు. సునీల్ కుమార్ చదివింది ఐపీఎస్సా లేక వైపీఎస్సా అని ప్రశ్నించారు. సీఐడీ చీఫ్ ఏ అధికారంతో ఎంపీని వెనకేసుకొచ్చారో చెప్పాలన్నారు. కేసు బాధ్యతలను ప్రభుత్వం సీఐడీకి ఎప్పుడు అప్పగించిందని నిలదీశారు. పోలీసు అధికారులు వీడియోను జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపకుండా కబుర్లేందుకని దుయ్యబట్టారు. మాధవ్ ది ఫేక్ వీడియో అయితే ఈపాటికి అది సృష్టించిన వారిని బూటకపు ఎన్ కౌంటర్ చేసేవాళ్లని ఎద్దేవా చేశారు.
TDP LEADER PATTABHI: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోలో ఎడిటింగ్ లేదని జిమ్ స్టాఫోర్డ్ ఇచ్చిన నివేదిక వాస్తవమని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి స్పష్టం చేశారు. త్వరలోనే మరిన్ని నిజాలతో బయటకు వస్తామన్నారు. మహిళలకు రక్షణ కల్పించే విషయంలో చొరవ చూపని సీఐడీ.. తప్పు చేసిన వారిని వెనకేసుకు రావటం దురదృష్టకరమన్నారు. మద్రాస్ ఐఐటీ నివేదికను ఫోర్జరీ చేసిన చరిత్ర వైకాపాదని తాము అలాంటి పనులు చేయబోమని స్పష్టం చేశారు.
TDP LEADER ANITHA: నగ్న వీడియో విషయంలో.. ఎంపీ గోరంట్ల మాధవ్ ను ప్రభుత్వం, పోలీసులు కాపాడాలని చూస్తున్నారని.. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. సంబంధం లేని సీఐడీ వాళ్లు వచ్చి.. వీడియోపై వివరణ ఇవ్వటమేంటని ప్రశ్నించారు. ఫోరెన్సిక్ రిపోర్టును ఎప్పుడో విడుదల చేస్తే.. సీఐడీ వాళ్లు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇన్ని రోజులుగా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు.
సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఏమన్నారంటే.. ఎంపీ గోరంట్ల మాధవ్ ఉన్నట్లు చెబుతున్న వీడియో అసలైనదేనని అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్ ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వలేదని ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ చెప్పారు. ఆ ల్యాబ్ అధికారి జిమ్ స్టఫోర్డ్‌కు తాము లేఖ రాస్తే.. ఈ మేరకు సమాధానమిచ్చారని ఆయన చెప్పారు. ఆయన ఇచ్చినట్లు సర్క్యులేట్ అవుతున్న పత్రం కూడా అసలైనది కాదని ఆయనే చెప్పినట్లు వెల్లడించారు. అయితే.. ప్రైవేటు ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చే ధ్రువీకరణకు ఎలాంటి ప్రామాణికత లేదని సీఐడీ అధినేత సునీల్ కుమార్ చెప్పారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో పులులు, సింహాలు ఉన్న సన్నివేశాన్ని ఫోన్‌లో రికార్డు చేసి.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపితే అది ఒరిజినల్‌గానే చెబుతారన్నారు. వీడియో సంభాషణ జరిగిన మహిళ లేదా పురుషుడి ఫోన్లలో రికార్డైన వీడియో దొరికితేనే.. అసలోకాదో తెలుస్తుందని సునీల్ కుమార్ చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో ఐటీ చట్టం ప్రకారం, సీఆర్పీసీ ప్రకారం కొన్ని తప్పులు జరిగినట్లు సునీల్ కుమార్ తెలిపారు. కాబట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ జరిగింది: హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్‌లో మాట్లాడుతున్నట్లున్న వీడియో ఒకటి నాలుగో (గురువారం) తేదీ రాష్ట్రంలో కలకలం రేపింది. ఉదయం 8 గంటల సమయంలో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైన ఈ వీడియో.. కొద్దిసేపటికే విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఎంపీ మాధవ్ నగ్నంగా ఓ మహిళతో వీడియో కాల్‌లో మాట్లాడటాన్ని రికార్డు చేసి, ఆ వీడియోను మరో ఫోన్‌తో చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. అంతకుముందు రాత్రి (బుధవారం) ఫేస్‌బుక్ మెసెంజర్‌లో తొలుత ఈ వీడియో వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కాసేపటికి ట్విటర్‌లోనూ కొంతమంది దాన్ని షేర్ చేశారు. గురువారం ఉదయం ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. దీనిపై గోరంట్ల మాధవ్ స్పందిస్తూ ఆ వీడియో నకిలీది అనీ, తాను జిమ్‌లో కసరత్తు చేస్తున్న వీడియోను మార్ఫింగ్ చేశారని చెప్పారు.
ఎస్పీ ఏమన్నారంటే.. "వీడియో కాల్ విషయంపై ఎంపీ గోరంట్ల మాధవ్ అభిమాని కొణతాల వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనంతపురం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఈనెల 4వ తేదీన కేసు నమోదు చేశాం. అనంతరం చేపట్టిన దర్యాప్తులో భాగంగా.. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో 3వ తేదీ అర్ధరాత్రివేళ 2 గంటల సమయంలో యూకేలో రిజిస్టర్ అయిన వొడా ఫోన్ నెంబర్‌తో మొదటగా.. ఐ-టీడీపీ వాట్సాప్ గ్రూప్‌లో ఈ వీడియో షేర్ చేసినట్టు గుర్తించాం. సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోన్ నెంబర్ ఇంటర్నేషనల్ నెంబర్ కావడంతో.. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. వొడాఫోన్ నుంచి నిందితుడి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నాం.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్ కాదు. ఒకరు మొబైల్‌లో చూస్తున్నప్పుడు.. దాన్ని మరొకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియోను చాలా సార్లు ఫార్వర్డ్ చేశారు. రీ-పోస్టు చేశారు. ఐ -టీడీపీ వాట్సాప్ గ్రూప్‌లో తొలిసారి పోస్టు చేసింది కూడా.. ఫార్వర్డ్ చేసిన వీడియోనే. అది ఒరిజినల్ వీడియో కాదు కాబట్టి.. అది మార్ఫింగ్ చేశారా? లేదా? అనేది తేల్చలేకపోతున్నాం.
ఒరిజినల్ వీడియో దొరికే వరకు.. దాన్ని మొదట పోస్టు చేసిన వ్యక్తి దొరికే వరకు.. ఈ విషయాన్ని నిర్ధారించలేము. ఒరిజినల్ వీడియో దొరికితేనే.. అది మార్ఫింగా? కాదా? అనేది చెప్పలేం. సోషల్ మీడియాలో చూస్తున్న వీడియో ఒరిజినల్ కాదు. వీడియో అప్‌లోడ్ చేసిన వ్యక్తి వివరాలు సేకరిస్తున్నాం. ఈ వీడియోకు సంబంధించి బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. వీడియోలో ఉన్నది ఎంపీ మాధవా? కాదా? అన్నది కూడా చెప్పలేం. వీడియోను యూకేలో ఎడిటింగ్ చేసినట్టు తెలుస్తోంది. ఒరిజినల్ వీడియో ఎవరి వద్దైనా ఉంటే.. బాధితులు ఎవరైనా ముందుకొచ్చి.. పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. ఒరిజినల్ వీడియో ఉంటేనే ఫోరెన్సిక్ నివేదిక వస్తుంది" అని ఎస్పీ ఫకీరప్ప చెప్పారు.
ఇవీ చదవండి: