TDP Protest on Charges Hike: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ రేట్లు పెరిగి అల్లాడుతున్న ప్రజలపై ప్రభుత్వం తాజాగా ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ ప్రజలను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తోందని తెలుగుదేెశం నేతలు మండిపడుతున్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమైంది.
నారా లోకేేశ్: వైకాపా పాలనలో బస్సు ఎక్కడం సైతం అదృష్టంగా భావించాల్సిన దుస్థితి దాపురించిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. 'యథా సీఎం-తథా అధికారులన్నట్లుగా' ప్రజల్ని మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై నిన్న ప్రకటనకు నేటి బాదుడుకి సంబంధం లేదన్న లోకేశ్.. పెంపు స్వల్పమేనని ఛార్జీలు భారీగా పెంచడం దారుణమని ఆక్షేపించారు. ఆర్టీసీని ఉద్ధరిస్తానని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ రెడ్డి చేతులెత్తేసి భారమంతా ప్రజలదే అనడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
బోండా ఉమ: కలలో సైతం ఊహించని ధరల పెరుగుదలను ప్రజలు చూస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి నిరంతరాయంగా కొనసాగిస్తున్నారని విమర్శించారు. తాజాగా ఆర్టీసీ ఛార్జీలు పెంచటం దుర్మార్గమన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోల్చితే ఏపీలోనే డీజిల్ ధరలు ఎక్కువ అన్న అయన డీజిల్పై రాష్ట్ర వాటా పన్ను తగ్గించుకుంటే ఛార్జీలు పెంచాల్సిన పనిలేదని తెలిపారు. పెంచిన ఛార్జీలు తగ్గించేవరకు తెలుగుదేశం పోరాడుతుందని స్పష్టం చేశారు.
విజయవాడ: పెంచిన RTC ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ కనకదుర్గ వారధి వద్ద... MLA గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం నిరసన కార్యక్రమం నిర్వహించింది. జగన్మోహన్‌రెడ్డి అంటేనే బాదుడే బాదుడు అన్నట్లుగా తయారైందని... రామ్మోహన్ విమర్శించారు. నమ్మి ఓట్లేసిన ప్రజలపై పిడిగుద్దులు కురిపిస్తున్నారని మండిపడ్డారు.
RTC ఛార్జీలు తగ్గించాలంటూ విజయవాడ శివారు గొల్లపూడిలో సీనియర్ నేత దేవినేని ఉమాతో కలిసి తెలుగుదేశం నాయకులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై బస్సులు ఆపేసి నిరసన తెలిపారు. కృష్ణా జిల్లా పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నాయకత్వంలో... కంకిపాడు బస్టాండ్ వద్ద తెలుగుదేశం కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
గుంటూరు: ఆర్టీసీ చార్జీలను పెంచడం పై గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు గారు పిలుపు మేరకు ఆర్టీసీ బస్సుల చార్జీలను తగ్గించాలని కోరుతూ ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ప్రత్తిపాడు బస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. ఆర్టీసీ బస్సులు వచ్చినప్పుడు అక్కడ నిలుచుని నినాదాలు చేశారు. రాష్ట్రంలో అన్ని ధరల పెంచుతూ బాదుడు కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టారని తెదేపా రైతు రాష్ట్ర మీడియా సమన్వ కర్త గింజుపల్లి వెంకటేశ్వరరావు అన్నారు. ధరలను తగ్గించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు.
అనంతపురం: పేదల నడ్డివిరిచేలా RTC ఛార్జీలు పెంచడం దారుణమని... అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెలుగుదేశం నేత ఉమామహేశ్వరనాయుడు అన్నారు. కార్యకర్తలతో కలిసి బాదుడే బాదుడు అంటూ ర్యాలీ నిర్వహించారు. డిపో ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బస్సు ఛార్జీల మోతపై చంద్రదండు అధ్యక్షుడు ప్రకాశ్ నాయుడు ఆధ్వర్యాన... అనంతపురం బస్టాండులో వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రయాణికులకు రోజాపూలు ఇచ్చిన ప్రకాశ్‌నాయుడు... జగన్‌కు ఓట్లేసి సమస్యలు తెచ్చుకున్నాం అంటూ వారికి గుర్తుచేశారు.
పెంచిన బస్ చార్జీలు తగ్గించాలని అనంతపురంలో తెదేపా నాయకులు నిరసన తెలిపారు. ఆర్టీసీ డిపో వద్ద మహిళ నాయకురాళ్లు నాయకులు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధరలు పెంచుతూ ప్రజల జీవితాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నారన్నారు. ఈ విధంగా ధరలు పెంచితే ప్రజలు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు ప్రజల పక్షాన తేదేపా పోరాడుతుందన్నారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
తిరుపతి జిల్లా: చంద్రగిరిలో ఆర్టీసీ ఛార్జీల పెంపుకు నిరసనగా బస్టాండ్ కూడలి వద్ద మండల తెదేపా అధ్యక్షుడు పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు అధ్యక్షతన నిరసన కార్యక్రమం చేపట్టారు. తెదేపా కార్యాలయం నుండి టవర్ క్లాక్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలిలో గల అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం బస్టాండ్ ఆవరణలో ప్రభుత్వానికి, సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనితో కొద్దిసేపు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెరిగిన విద్యుత్, ఆర్టీసీ, నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించ పేద ప్రజలకు బాసటగా నిలవాలని వారు కోరారు.
తిరుపతి జిల్లా వెంకటగిరి క్రాస్ రోడ్లు కూడలి వద్ద అంబేడ్కర్ విగ్రహం వద్ద టీడీపీ ఆధ్వర్యం లో జయంతి వేడుకలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ పాల్గొని అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసారు. పేదలకు ఆయన అన్న సంతర్పణ చేశారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు పాలనలొ అంబేడ్కర్ రాజ్యాంగం తూచ తప్పకుండా అమలు చేసిన ఘనత ఆయితే జగన్ లెక్కలెని తనంగా ఉందని విమర్శించారు.
ఇప్పటికే అన్ని రకాల చార్జీలు పెంచి ప్రజల నెత్తిపై శివతాండవం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్తగా బస్ చార్జీలు పెంచడం దారుణం కడప తెదేపా పార్లమెంటు అధ్యక్షులు లింగా రెడ్డి ధ్వజమెత్తారు. కనీసం ఏ మాత్రం ఆలోచించకుండా రాత్రి రాత్రికే బస్సు చార్జీలు పెంచడం సబబు కాదని ఖండించారు. పెంచిన బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కడప ఆర్టీసీ బస్టాండు ఎదుట టిడిపి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. చేతిలో ప్లకార్డులు పట్టుకుని వైకాపా సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కడప: ప్రకాశం జిల్లా కనిగిరి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. మొదటిగా కనిగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి పెరిగిన ఆర్టీసీ, పెట్రోల్ ,విద్యుత్, నిత్యవసర ధరలతో ఉన్న ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ... భారీ ర్యాలీ ప్రదర్శన చేశారు. కనిగిరి నగర పంచాయతీలోని ప్రధాన వీధుల గుండా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాదుడే బాదుడు అంటూ ర్యాలీగా ఒంగోలు బస్టాండ్ కూడలికి చేరుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా: పెరిగిన ఆర్టీసీ ఛార్జీలను నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి లో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టిడిపి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనపర్తి దేవి చౌక్ లోని బస్ స్టాండ్ చెవిలో పువ్వులు పెట్టుకుని ప్రయాణికులకు పువ్వులు అందిస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలి RTC కాంప్లెక్స్ వద్ద తెలుగుదేశం నాయకులు నిరసన చేపట్టారు. జగన్ పాలనలో బాదుడే బాదుడు అంటూ నినాదాలు చేశారు. పెంచిన ఛార్జీలు తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేకుంటే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
పాతపట్నం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో తెదేపా నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వం ఆర్ టి సి బస్ చార్జీలు పెంచిన నేపథ్యంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి కలమట సాగర్ ఆధ్వర్యంలో నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు పాతపట్నం ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం బస్టాండ్ వరకు నాయకులు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలపై ప్రభుత్వం వివిధ రకాల రీతుల్లో ప్రజలపై భారం పెంచేలా ధరలను పెంచడం దురదృష్టకరమన్నారు సామాన్యుడు వినియోగించే ఆర్ టి సి బస్ చార్జీలు సైతం పెంచడం అన్యాయమన్నారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
విజయనగరం: RTC ఛార్జీల బాదుడుకు వ్యతిరేకంగా విజయనగరం, మన్యం జిల్లాలో తెలుగుదేశం నాయకులు ఆందోళన చేపట్టారు. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మానవహారాలు, ధర్నాలు నిర్వహించారు. గరుగుబిల్లి, తెర్లాం, కొత్తవలస, నెల్లిమర్ల, గజపతినగరం, బొబ్బిలిలో తెలుగుదేశం నాయకులు నిరసన వ్యక్తంచేశారు.
అనంతపురం: ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై ప్రయాణికులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్లెవెలుగు బస్సుల్లో కనీస ఛార్జీని పది రూపాయలకు పెంచటం, ఆటోల్లో ప్రయాణానికి ప్రోత్సహించటమేనని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఇప్పటికే నిత్యావసరాల ధరల పెరుగుదలతో పేదలు, సామాన్యులు అల్లాడిపోతుంటే, బస్సు ఛార్జీలు పెంచటం తీవ్ర భారం కానుందని చెబుతున్నారు. పెంచిన బస్సు ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని అనంతపురం బస్టాండులో ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: మంత్రి ఊరేగింపులో శృతిమించిన సంబరాలు..నడిరోడ్డుపై కరెన్సీ