ఇళ్ల పట్టాల పేరుతో వైకాపా నేతలు 6500 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. ఆ నిధులను సక్రమంగా వినియోగించి ఉంటే అదనంగా 13 లక్షల మంది పేదలకు 23,666 ఎకరాలు పంచే వీలుండేదన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.
తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు అజ్జారం రోడ్డులో 55 ఎకరాలను ఎకరా కోటి 5 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వానికి విక్రయించి 57.75 కోట్ల రూపాయలు దండుకున్నారు. పెందుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అదీప్ రాజు 8.78 ఎకరాల విస్తీర్ణమున్న వీర్రాజుచెరువుకే ఎసరు పెట్టారు. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి 503ఎకరాల భూమికి సంబంధించి 133 కోట్ల రూపాయల కుంభకోణం చేశారు. ఎకరా 25- 30 లక్షల రూపాయలు విలువ చేసే భూమిని 75 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వానికి అంటగట్టారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ 130 ఎకరాలను 45 లక్షల రూపాయలకు కొనుగోలు చేసి 200 కోట్ల రూపాయల వరకు అవినీతికి పాల్పడ్డారు. రాష్ట్రమంతటా ఈ తరహా వ్యవహారాలు అనేకం జరిగాయి. కుంభకోణానికి అడ్డువచ్చారనే నెల్లూరు జిల్లా వైకాపా నేతలు అక్కడి కలెక్టర్ శేషగిరిబాబును బదిలీ చేయించారు. మేము ఆధారాలను ప్రజల ముందు పెట్టాక కూడా తాము అవినీతికి పాల్పడలేదని వైకాపా నేతలు చెప్పగలరా?. భూ సేకరణలో 4 వేల కోట్లు, మెరక నెపంతో 2 వేల కోట్లు, ఇళ్ల పట్టాలు ఇప్పించేందుకు 500 కోట్ల రూపాయల వరకూ దోచుకున్నారు. ఈ మొత్తంతో పట్టణాల్లోనే 4 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చు- కొమ్మారెడ్డి పట్టాభిరామ్, తెదేపా అధికార ప్రతినిధి
ఇదీ చదవండి