చేనేత దినోత్సవం రోజు కూడా చేనేత సంక్షేమంపై సీఎం జగన్ అబద్ధాలు మాట్లాడుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శించారు. మూడున్నర లక్షల మంది చేనేతల్లో... ప్రభుత్వం అందించిన సాయం 80వేల మందికేనా..? అని ప్రశ్నించారు. ఏడాది పాలనలో చేనేతలకు వైకాపా ప్రభుత్వం చేసిందేమీ లేదని మండిపడ్డారు.
జగన్ 14 నెలల పాలనలో గోరంత సాయం చేయలేదు కానీ కొండంత ప్రచారం మాత్రం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. 24వేలు ఇస్తున్నామన్న జగన్...మగ్గాలు, లబ్ధిదారుల సంఖ్య ఎందుకు చెప్పలేదని నిలదీశారు. 3.50 లక్షల మగ్గాలు ఉండగా...వారిలో ఎంత మందికి సాయం అందిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. మంగళగిరిలో రెండు వేలకు పైగా మగ్గాలుంటే.. 303 మందికి మాత్రమే పథకం అందిందన్నారు.
ఎన్నికల ముందు ప్రతి చేనేత కుటుంబానికి అని హామీ ఇచ్చి గెలిచాక... మగ్గం ఉంటేనే అర్హులంటూ లక్షలాది మంది చేనేతలను వంచించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా హయాంలో ఒక్కొక్కరికీ లక్ష చొప్పున రుణం ఇస్తే... ఆ లక్షను జగన్ నలుగురికి పంచుతూ ఆర్భాటం చేస్తున్నారని విమర్శించారు.
ఇదీ చదవండి
'అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే... రాజకీయాల నుంచి తప్పుకుంటా'