KANAKAMEDALA : చట్టం ముసుగులో ఏపీలో అరాచకాలు జరుగుతున్నాయని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు..తర్వాత చేసే పనులకు పొంతన లేదన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ అసత్యాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు అమరావతికి అభ్యంతరం లేదని.. ఎన్నికల తర్వాత మాట మార్చి మడమ తిప్పారని ఆగ్రహించారు.
కులాలు, ప్రాంతాల వారీగా ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టేలా సీఎం మాట్లాడారని.. రైతులకు ఏదైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు. రైతుల పాదయాత్రకు విపరీతమైన స్పందన వస్తోందని.. శాంతి భద్రతల సమస్యలు సృష్టించాలని చూస్తున్నారన్నారు. ఆదాయం పెరిగింది.. అప్పులు రెండు రెట్లు పెరిగాయని.. ప్రాజెక్టులు ఆగిపోయాయి.. తెచ్చిన డబ్బులకు లెక్కల్లేవన్నారు.
కేంద్రం ఇచ్చే నిధులను పక్కదారి పట్టిస్తున్నారని కేంద్రమే చెబుతోందని గుర్తు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. అవినీతి లేదనుకుంటే శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. మూడున్నరేళ్లుగా ఆర్థిక అంశాలపై రాష్ట్రాన్ని ప్రశ్నిస్తున్నామని.. ఆదాయం, అప్పులు, ఖర్చులపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: