ఇరుపక్షాల ఉమ్మడి అంగీకారంతో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసు దాఖలు చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా కాలయాపన చేయడంతో పాటు అనవసర అప్పీళ్లతో కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు రూ.లక్ష జరిమానా విధిస్తూ గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.
కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే... దేవీ సీఫుడ్స్ అనే సంస్థ సర్ఫేసీ యాక్ట్ (సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్) కింద బ్యాంకులు వేలం వేసిన ఆస్తులను కొనుగోలు చేసింది. వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి బ్యాంకులు జారీచేసిన విలువ ఆధారిత సర్టిఫికెట్ ప్రకారం ఫీజు చెల్లించడానికి సిద్ధపడగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మార్కెట్ విలువ ప్రకారం చెల్లించాలని షరతు పెట్టింది. దాంతో ఆ సంస్థ హైకోర్టు సింగిల్ బెంచ్‌ని ఆశ్రయించింది.
ఈ కేసును పరిశీలించిన జస్టిస్ ఎం.గంగారావు... గతంలో 2014లో ఇలాంటి కేసులోనే ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకొని బ్యాంకులు జారీచేసిన ధ్రువపత్రాన్నే మార్కెట్ విలువ కింద లెక్కించి స్టాంప్‌డ్యూటీ వర్తింపజేయాలని 2020 నవంబరులో తీర్పు ఇచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు వెళ్లడంతో అక్కడా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ గోస్వామి పాత తీర్పునే ధ్రువీకరించారు. ఈ అంశాన్ని 2014లోనే హైకోర్టు సంపూర్ణంగా పరిష్కరిస్తూ తీర్పుచెప్పినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తరుఫు న్యాయవాది ఏకసభ్య ధర్మాసనం ముందు చెప్పారని గుర్తుచేశారు.
ప్రభుత్వ అప్పీల్‌ను డిస్మిస్ చేస్తున్నామని పేర్కొంటూ ఈ ఏడాది మార్చి 31న తీర్పు చెప్పారు. మళ్లీ ఈ తీర్పును సైతం సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ సమ్మతితో ఇచ్చిన తీర్పును ప్రభుత్వమే సవాల్ చేస్తూ దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీని డిస్మిస్ చేస్తూ రూ.లక్ష జరిమానా విధించారు.
ఇదీ చూడండి: జీజీహెచ్ కాన్పుల వార్డులో పాము కలకలం.. పరుగులుతీసిన బాలింతలు..!