రాజధాని తరలింపు నిర్ణయం రాష్ట్ర చరిత్రలో చీకటిరోజని ఎంపీ సుజనా చౌదరి అభివర్ణించారు. 200 రోజులుగా అమరావతి రైతులు ఆందోళన చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఉద్యమంలో పాల్గొన్న రైతులపై తప్పుడు కేసులు పెట్టారని.. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మహిళలను లాఠీలతో కొట్టారని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల మనోవేదనకు గురై పలువురు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర భవిష్యత్, భావితరాల కోసం రైతులు భూములిచ్చారని.. పార్టీల కోసమో, వ్యక్తుల కోసమో భూములు ఇవ్వలేదని సుజనా చౌదరి అన్నారు. రాజధాని తరలింపు అనేది 29 గ్రామాలకే సంబంధించింది కాదని.. 13 జిల్లాలకు సంబంధించిందన్నారు. రాజధాని రాష్ట్రానికి ఒక గ్రోత్ ఇంజిన్ అని సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు.
రైతులకు న్యాయం జరిగేలా భాజపా ఎంపీగా శాయశక్తులా కృషిచేస్తానని సుజనా చౌదరి హామీ ఇచ్చారు. రాజధాని అంగుళం కూడా కదలదని.. రైతులు ఆందోళన చెందొద్దని సుజనా చౌదరి అన్నారు. కేంద్రం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందన్నారు.
ఇదీ చదవండి: 'రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కోరాం'