కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనానికి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల కమిటీకి సహకారాన్ని అందించేందుకు మరో 4 సబ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. జిల్లాల స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లాల సరిహద్దులు, న్యాయపరమైన చిక్కులపై సీసీఎల్ఏ నేతృత్వంలో మొదటి సబ్ కమిటీని నియమించారు. కొత్త జిల్లాల్లో ఉండాల్సిన వ్యవస్థ, సిబ్బంది విభజనపై సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి నేతృత్వంలో రెండో సబ్ కమిటీని నియమించారు. ఏర్పడబోయే జిల్లాల్లో ఆస్తులు, మౌలిక సదుపాయాల కల్పనపై రవాణా, ఆర్అండ్బీ కార్యదర్శి నేతృత్వంలో మూడో సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ అదేశాలు ఇచ్చారు. కొత్త జిల్లాల్లో ఐటీ వ్యవహారాలకు సంబంధించి ఐటీ కార్యదర్శి నేతృత్వంలో నాలుగో సబ్ కమిటీని నియమించారు.
ఇక జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా స్థాయి అధికారులతో కమిటీలను వేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లా కమిటీల్లో సభ్యులుగా జేసీ, ఎస్పీ, డీఈఓ, డీఎంఅండ్‌హెచ్‌వో, సీఈఓ, సీపీఓ, డీటీఓ, ఆర్అండ్బీఎస్ఈ ఉండనున్నారు. క్షేత్రస్థాయి నుంచి ఫీడ్ బ్యాక్, సమాచారం, అభిప్రాయాలను సబ్ కమిటీల ద్వారా సీఎస్ నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి కమిటీ సేకరించనుంది.
ఇవీ చదవండి..