అమ్మఒడి పథకంలో భాగంగా ప్రభుత్వం విద్యార్థులకు రూ.15వేలు ఇస్తోంది. 2019-20 విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకంలో తొలి ఏడాది జమచేసిన నగదులో రూ.1000 మరుగుదొడ్ల నిర్వహణకు విరాళంగా తీసుకుంది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సాయం మొత్తాన్ని జమచేసిన తరువాత వారి సమ్మతితో రూ.1000 తీసుకోవాలని సూచించారు. గతేడాది మాత్రం రూ.14వేలు తల్లుల ఖాతాల్లో జమచేసి రూ.1000లను మరుగుదొడ్ల నిర్వహణకు ప్రభుత్వమే నేరుగా బదలాయించింది. ఈ ఏడాది మాత్రం విద్యార్థుల అవసరాల దృష్ట్యా ల్యాప్‌టాప్‌లు కూడా ఇవ్వడానికి నిర్ణయించింది. కొవిడ్ విస్తృతంగా నమోదవుతున్న ప్రస్తుత తరుణంలో ఆన్‌లైన్ తరగతులకు ప్రాధాన్యత ఏర్పడింది. ఉన్నత విద్యకు ల్యాప్‌టాప్‌లు దోహదపడతాయని ప్రభుత్వం భావించింది. అందుకే విద్యార్థులకు రెంటిలో ఏది కోరుకుంటే అది ఇచ్చేలా వారి తల్లిదండ్రుల సమ్మతి తీసుకున్నారు.
* ఈసారి 9 నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌కు అవకాశం కల్పించింది. అమ్మఒడి సాయం అందించేందుకు పాఠశాలలు, కళాశాలల వారీగా విద్యార్థులు ఎంచుకున్న వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. ఆ నివేదిక ప్రకారం ఎక్కువమంది నగదువైపే మొగ్గు చూపారు. మిగిలిన వారు ల్యాప్‌టాప్‌లను ఎంచుకున్నారు. ఒకటినుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు మాత్రం తల్లుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేస్త్తోంది. పేరున్న కంపెనీలకు చెందిన ల్యాప్‌టాప్‌లను అందజేస్తామని ప్రకటించింది. అయినా ఆ స్థాయిలో విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి స్పందన కరవయ్యింది.
కోరుకున్నది ఇస్తారు
విద్యార్థులు ఏది కోరుకుంటే అదే ప్రభుత్వం మంజూరు చేస్తుంది. జిల్లావిద్యాశాఖాధికారి ఆదేశాలమేరకు వివరాలు సేకరించి ఆన్‌లైన్ చేశాం. కొన్ని పాఠశాలల్లో ఎక్కువమంది ల్యాప్‌టాప్ కోరుకున్నవారు కూడా ఉన్నారు. మొత్తంగా చూస్తే నగదుకే ఎక్కువమంది మొగ్గు చూపారు. కొందరు మాత్రం ఆన్‌లైన్ బోధనకు ల్యాప్‌టాప్‌లు దోహదపడతాయని భావించి వాటిని ఎంచుకున్నారు. ఎంచుకున్నదాన్ని బట్టి వారికి సాయం అందుతుంది.
- యూవీ సుబ్బారావు, డీవైఈవో, మచిలీపట్నం
ఇదీ చదవండీ… ఐఎన్ఎస్ జలాశ్వ నౌకలో.. దేశానికి చేరనున్న విదేశీ సహాయం