తనకు చదువుకోవాలని ఉందని.. కానీ ఇంట్లో పెద్దలు పెళ్లి చేయాలని చూస్తున్నారంటూ ఓ బాలిక పంపిన మెసేజ్‌కు స్పందించిన తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ఆ విద్యార్థినిని కాపాడి బాలికా సదన్‌లో చేర్పించారు. నవాబ్‌పేట మండలానికి చెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు. మూడో కుమార్తె స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆమెకు పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్నారు. 2018లో రెండో అమ్మాయికి కూడా ఇలాగే తల్లిదండ్రులు బాల్య వివాహం చేయాలని చూడగా అప్పట్లో ఆమె ఎస్పీ సెల్ నంబరుకు ఫోన్ చేయగా పోలీసులు పెళ్లిని అడ్డుకున్నారు.
ఆ నంబరును నోట్‌బుక్‌లో రాసిపెట్టుకొన్న చిన్న కుమార్తె కూడా తాజాగా తన వివాహ ప్రయత్నాల గురించి సోమవారం ఎస్పీ రెమా రాజేశ్వరికి మెసేజ్ పెట్టింది. స్పందించిన ఎస్పీ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ హనుమప్పను ఆదేశించగా ఆయన ఆ బాలిక చదువుతున్న పాఠశాలకు వెళ్లి విచారించారు. ఆమెను బాలికా సదన్‌కు తరలించారు. మంగళవారం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రవేశపెట్టనున్నట్లు సీఐ హనుమప్ప తెలిపారు.
ఇదీ చదవండి: దశాబ్దాల అనంతరం... ఓటు హక్కు వినియోగించుకున్నారు!