ఒకే ఒక్క గేటు...! కావాల్సింది కేవలం రూ.7.75 కోట్లు...చిన్నాచితకా ప్రాజెక్టులో కూడా కాదు. కృష్ణా డెల్టాకు బ్యాలెన్సింగ్ జలాశయంగా ఉన్న పులిచింతలలో... ఏకంగా 45.77 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో...నిరుటి ఆగస్టులో వరదలకు నిర్వహణ లోపాలతో గేటు కొట్టుకుపోయింది...ఇప్పటికే 9 నెలలు పూర్తయింది..దాని స్థానంలో తాత్కాలికంగా స్టాప్‌లాగ్ గేటు ఏర్పాటు చేశారు...మళ్లీ వరదల కాలం వస్తోంది. ఆ స్టాప్‌లాగ్ గేటు ఎంతవరకు భద్రమో తెలియడంలేదు.
ఆగస్టు 5న ఏం జరిగింది? : అది 2021 వరదల సీజన్. పులిచింతలకు ఎగువ నుంచి భారీగా వరద వస్తున్న క్రమంలో ఆగస్టు 5 తెల్లవారుజామున 250 టన్నుల బరువున్న 16వ నంబరు గేటు కొట్టుకుపోయింది. దీంతో జలాశయంలో నిల్వ ఉన్న నీటిని సముద్రంలోకి వృథాగా వదిలేయాల్సి వచ్చింది. గేటుకు సంబంధించి టై ప్లాట్స్, గేటును ఎత్తేందుకు, దించేందుకు ఉపయోగించే తాళ్లు తెగిపోయినట్లు గుర్తించారు. వీటిలో వినియోగించే బోల్టులు పూర్తిగా విరిగిపోయాయి. వాటిలో ఉండే పుల్లీస్ పడిపోయాయి. ఆ గేటు దాదాపు 750 మీటర్లు దూరం వెళ్లి పడిపోయినట్లు గమనించారు. ప్రాజెక్టును నిపుణుల కమిటీ సందర్శించింది. కొన్ని సిఫార్సులు చేసింది.
డ్యామ్‌ల భద్రతపై పూర్తి స్థాయి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి సమగ్ర సిఫార్సులతో చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. కొట్టుకుపోయిన గేటు స్థానంలో కొత్తది ఏర్పాటు చేయాల్సి ఉంది. నూతన గేటుకు రూ.7.50 కోట్లు, స్టాప్ లాగ్ గేటు, ఇతర పనులకు రూ.9.50 కోట్లతో ప్రభుత్వానికి జల వనరులశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. వాటికి పాలనామోదం లభించాక టెండర్లు పిలిచి పనులు చేపడతారు. అయితే ఆ ప్రతిపాదనలకు ఇప్పటికీ ఆమోదం దక్కలేదు. మరిన్ని వివరాలు, నిపుణుల కమిటీ సిఫార్సులు జత చేసి పంపాలని వెనక్కి పంపినట్లు తెలిసింది. ఆయా వివరాలతో ప్రభుత్వానికి మళ్లీ అంచనాలు వెళ్లాయి. పులిచింతల ఘటన జరిగి దాదాపు 9 నెలలవుతోంది. మరో నెల రోజుల్లో వరద సమయం వచ్చేస్తుంది. ఇప్పటికే అవసరమైన పనులు పూర్తి చేసుకుని ఉండాలి. కానీ... వాటి ఊసే లేదు.
ఎన్నో సమస్యలు... : ప్రమాదాలు ఎప్పుడూ చెప్పి రాబోవని ఇంజినీర్లు ఆందోళన చెందుతున్నారు. పులిచింతల ప్రాజెక్టులో మొత్తం 45.77 టీఎంసీల నీటి నిల్వకు అవకాశం ఉంది. ఈ నిల్వ సామర్థ్యాన్ని నిర్వహించేందుకు వచ్చే వరదను అంచనా వేసి తదనుగుణంగా దిగువకు వదిలేందుకు వీలుగా 22 గేట్లు అవసరమని లెక్క తేల్చారు. అంతకన్నా మరో రెండు గేట్లు అదనంగా ఏర్పాటు చేశారు.
- నిజానికి ఒక గేటు కొట్టుకుపోతే వరద నిర్వహణలో సమస్యలు రాకపోవచ్చు. కానీ... కొట్టుకుపోయిన 16వ గేటుకు అటూ ఇటూ ఉన్న 15, 17 గేట్లనూ తెరవవద్దని, వాటిని నిర్వహించవద్దని తాజాగా నిపుణుల కమిటీ సభ్యులు సూచించినట్లు తెలిసింది.
- అంటే మొత్తం 24 గేట్లకు మూడింటిని నిర్వహించే వీలు లేదు. ఇక 21 గేట్లతోనే ప్రాజెక్టు వరదను దిగువకు వదలాల్సి ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో ఇది సులభమే కానీ ఎగువ నుంచి భారీ వరదలు వచ్చే క్రమంలో సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని ఇంజినీర్లే ఆందోళన చెందుతున్నారు.
- గతంలో ఘటన జరిగినప్పుడు 33 టీఎంసీల నిల్వకు పరిమితం చేయాలని నిపుణులు సూచించారు. ఆ తర్వాత ఇటీవలి రోజుల్లో వరద పెద్దగా లేని సందర్భంలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు. వరద కాలంలో ఇలా పూర్తిస్థాయి నీటి నిల్వకూ అవకాశం లేదని చెబుతున్నారు.
మరికొన్ని కొత్త సిఫార్సులు... : అన్నమయ్య ప్రాజెక్టు డ్యాం కొట్టుకుపోయిన తర్వాత ప్రభుత్వం అన్ని డ్యాంల భద్రతను పరిశీలించేందుకు సాంకేతిక నిపుణుల కమిటీని నియమించింది. ఆ సభ్యులు తాజాగా మే నెల ప్రారంభంలో పులిచింతల ప్రాజెక్టును సందర్శించారు. నివేదిక ఇంకా ఇవ్వాల్సి ఉంది. డ్యాం భద్రతకు ప్రభుత్వం నియమించిన విశ్రాంత ఇంజినీరింగ్ నిపుణులు రౌతు సత్యనారాయణ, రామరాజు, ఐఎస్‌ఎన్ రాజు, గిరిధర్‌రెడ్డి, ప్రొఫెసర్ సుదర్శన్, ఆకృతుల సంస్థ చీఫ్ ఇంజినీరు శ్రీనివాస్ తదితర నిపుణులు డ్యాంను సమగ్రంగా పరిశీలించారు. వీరి సూచనలు ఇంకా మినిట్స్ రూపంలో రాకున్నా మౌఖికంగా వారు అక్కడ తెలియజేసిన ప్రకారం ఇలా ఉన్నాయి...
- ఈ ప్రాజెక్టులో గేట్ల ఏర్పాటుకు నిర్మించిన అన్ని పియర్ల సామర్థ్యాన్ని పరీక్షించాలి. మొత్తం 24 గేట్లు ఉన్నాయి. వాటి కోసం 48 పియర్లు నిర్మించారు.
- మరో రెండు స్టాప్‌లాగ్ గేట్లు ఏర్పాటు చేసుకోవాలని వారు స్థానిక అధికారులకు సూచించారు.
- విరిగిపోయిన గేటు స్థానంలో ఏర్పాటు చేసే కొత్త గేటుకు హైడ్రాలిక్ విధానం అనుసరించాలి.
- పనులు చేసుకునేందుకు వీలుగా గేట్ల నిర్వహణకు అవసరమైన కాలి నడక వంతెన (వాక్ వే బ్రిడ్జి) నిర్మించాలని కమిటీ సూచించింది. ఇక్కడ మొత్తం 24 గేట్లుండగా 12 గేట్ల వరకు మాత్రమే వంతెన ఉంది.
- ఇదీ చదవండి: 'ఆఫ్ బడ్జెట్ అప్పులపై.. ఆ వివరాలివ్వండి'