వరంగల్‌లో గైనకాలజిస్టు డాక్టర్ ఝాన్సీదేవి అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఆ కుటుంబంలో అమ్మమ్మ, అమ్మ, ఇద్దరు మనవరాళ్లూ డాక్టర్లే..!
Three Generations Doctors : డెబ్భైవ దశకం మొదలు స్త్రీ వైద్యనిపుణురాలుగా తెలంగాణలోని వరంగల్‌లో వేలాది మంది మహిళలకు పురుడు పోసి, చికిత్సలందించారు డాక్టర్ కొండూరి ఝాన్సీదేవి(84). భర్త డాక్టర్ శాస్త్రితో కలసి ఆమె ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు వైద్యసేవలందించి నేటితరం వైద్యులెందరికో స్ఫూర్తిగా నిలిచారు. అమ్మ ఝాన్సీదేవి స్ఫూర్తిని కొనసాగిస్తూ డాక్టర్ చిలుకూరి అన్నపూర్ణ(54) వైద్యవృత్తిలోకి వచ్చారు. కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, ఆపైన అప్తాల్మాలజీలో పీజీ చేసి నేత్ర వైద్య నిపుణురాలిగా 1996 నుంచి సేవలందిస్తున్నారు.
సహాధ్యాయి డాక్టర్ శరత్ కుమార్‌ను పెళ్లి చేసుకున్నాక హనుమ కొండలో ‘శరత్ ఐకేర్’ను ప్రారంభించారు. ఆ వారసత్వం అక్కడితో ఆగిపోలేదు. అమ్మమ్మా, అమ్మలను స్ఫూర్తిగా తీసుకున్న అన్నపూర్ణ ఇద్దరు కూతుళ్లూ వైద్య వృత్తిలోకి వచ్చారు. పెద్దమ్మాయి సంజన నేత్ర వైద్యురాలు, రెండో అమ్మాయి మేఘన అమెరికాలో రెసిడెన్సీ వైద్యురాలు. రోగుల మనసెరిగి వారితో ఆప్యాయంగా మాట్లాడితే సగం రోగం నయమవుతుందని డాక్టర్ ఝాన్సీదేవి చెప్పిన మాటల్ని అనుసరిస్తున్నామంటారు అన్నపూర్ణ, ఆమె కుమార్తెలూ.
‘రోగులతో మాట్లాడే తీరునుబట్టి వాళ్లకు మనపట్ల విశ్వాసం కలుగుతుంది. అది వృత్తిలో రాణించడానికి దోహదపడుతుంది. నేటి తరం వైద్యులు ఎంత బిజీగా ఉన్నా రోగుల బాధలను శ్రద్దగా, ఓపిగ్గా విని వైద్యం అందించగలిగితే డాక్టర్‌గా విజయం సాధించవచ్చు. అమ్మ నాకు ఇదే విషయాన్ని చెప్పింది. మా పిల్లలకీ నేనిదే చెబుతుంటా’ అంటారు అన్నపూర్ణ. అమ్మమ్మ, అమ్మ తమకు ఆదర్శంగా నిలిచారంటారు సంజన, మేఘన. తమకు వైద్యపరంగా ఎలాంటి సందేహాలు వచ్చినా వారి సలహాలు తీసుకుంటామంటారు.
తెలుగు రాష్ట్రాల నుంచి గైనకాలజీలో రోబోటిక్ సర్జరీ.. విధానంలో మెలకువలు నేర్చుకున్న మొదటి మహిళా వైద్యురాలు డాక్టర్ కవిత. ఆ వివరాలు ఆమె మాటల్లో..
మొదటి రోబోటిక్ సర్జన్.. మాది జనగామ. గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తయ్యాక పెళ్లైంది. ఉస్మానియా నుంచి గైనకాలజీలో పీజీ చేశా. మాకు ముగ్గురు పిల్లలు. వాళ్లకోసం కొన్నేళ్లు ప్రాక్టీసుకి దూరంగా ఉన్నా. అయినా జర్నల్స్ చదువుతూ, సెమినార్లకు హాజరయ్యేదాన్ని. పిల్లలు కొంచెం పెద్దయ్యాక తిరిగి ప్రాక్టీసు కొనసాగించా. వస్తూనే లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయడం నేర్చుకుని.. అయిదు వేల సర్జరీలు చేశా. అప్పటికి విదేశాల్లో రోబోటిక్ సర్జరీలు ప్రారంభమయ్యాయి. కోత, ఎక్కువ రక్తస్రావం, నొప్పి లేకుండా చేయడం వీటి ప్రత్యేకత.
గర్భాశయ సమస్యలకు భారీగా కోత పెట్టి సర్జరీలు చేసేవారు. లాప్రోస్కోపీతో అది కొంత తగ్గింది. రోబోటిక్ సర్జరీలు ఇంకా మంచి పరిష్కారమనిపించింది. హైదరాబాద్ కిమ్స్‌లో రోబోటిక్ సర్జరీలు ప్రవేశపెట్టాలనుకున్నప్పుడు శిక్షణ కోసం ఒక బృందాన్ని అమెరికా పంపారు. అందులో నేనూ ఉన్నా. అలా తెలుగు రాష్ట్రాల నుంచి దీన్లో శిక్షణ తీసుకున్న మొదటి గైనకాలజిస్ట్‌నయ్యా. ఈ సర్జరీలకు ఎక్కువ ఖర్చని చేయించుకోడానికి మొదట్లో ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. ఉపయోగాలు వివరించడంతో.. మెల్లగా అలవాటు పడ్డారు. ఈ విధానంలో 150కు పైగా సర్జరీలు చేశా. ప్రస్తుతం కాంటినెంటల్ హాస్పిటల్‌లో సేవలందిస్తున్నా. మావారు లక్ష్మీపతి కిమ్స్‌లో కంటి వైద్యుడు. పెద్దమ్మాయి ఎంబీబీఎస్ చేసింది.
వైద్య వృత్తిలో ఆటవిడుపు అనేదే ఉండదు. కానీ అది ఉంటేనే రాణించగలమంటున్నారు డాక్టర్ జ్వాల శ్రీకళ. అలా ఎందుకంటున్నారంటే...
ఇటు వైద్యం.. అటు నాట్యం... నాన్న ఉద్యోగ రీత్యా నా చిన్నప్పుడు దిల్లీలో ఉండేవాళ్లం. అయిదేళ్లకే సంప్రదాయ నృత్యంలో శిక్షణ మొదలుపెట్టా. 1985లో హైదరాబాద్ వచ్చేశాక డాక్టర్ ఉమారామారావు వద్ద శిష్యరికం చేశా. ఇంటర్‌నాటికే భరతనాట్యం, కూచిపూడిల్లో డిప్లొమా చేసి వందకుపైగా ప్రదర్శనలిచ్చా. చదువులోనూ చురుకే. గాంధీలో ఎంబీబీఎస్, ఉస్మానియా నుంచి రేడియాలజీలో పీజీ చేశా. ప్రస్తుతం కిమ్స్‌లో సీనియర్ కన్సల్టెంట్ రేడియాలజిస్ట్‌ని.
చదువుతోపాటు నృత్యాన్నీ దీక్షగా అభ్యసించా. ఐసీసీఆర్ ఎంప్యానల్డ్, దూరదర్శన్ ఏ గ్రేడ్ ఆర్టిస్ట్‌ని. దేశ విదేశాల్లో 300కు పైగా ప్రదర్శనలు ఇచ్చా. డాక్టర్‌గా చేస్తూనే నృత్యకారిణిగానూ నన్ను మెరుగుపర్చుకుంటూ వచ్చా. సింహనందిని, మయూర కౌత్వం.. లాంటి నృత్య రూపాల్లోనూ శిక్షణ పొందా. యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, లండన్, హాంకాంగ్ లాంటి దేశాల్లోనూ ప్రదర్శనలిచ్చా. రోజూ గంటసేపైనా ప్రాక్టీసు చేస్తా. వారంలో రెండ్రోజులు డ్యాన్స్ నేర్పిస్తుంటా. డ్యాన్స్‌వల్ల శారీరకంగానే కాదు మానసికంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఒత్తిడితో కూడిన వృత్తి నిపుణులూ.. డ్యాన్స్, సంగీతం, పెయింటింగ్, ఫొటోగ్రఫీ.. ఇలా ఏదో ఒక హాబీనీ అభ్యసించడం మేలు. దీనిద్వారా సంతోషంగా ఉండొచ్చు. సమయం ఎక్కడ అనుకోవద్దు. మనసుంటే మార్గం ఉంటుంది.
తిరుపతికి చెందిన ప్రముఖ డాక్టర్ కృష్ణప్రశాంతి, ఈమె తల్లి సరోజ, కూతురు వర్షిత కూడా వైద్యులే. అభిమన్యుడు తల్లి గర్భంలోనే పద్మవ్యూహం గురించి తెలుసుకొన్నట్టు తానూ, తన కూతురూ వైద్యం గురించి తెలుసుకున్నాం అంటారీవిడ.
ఆయుర్వేద వైద్యుడైన తన తండ్రి స్ఫూర్తితో ఆరు దశాబ్దాల కిందటే వైద్యవృత్తిలోకి అడుగుపెట్టారు కె.సరోజ. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంకు చెందిన సరోజ.. 1965లో తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్యకళాశాలలో చదువుకున్నారు. ఖమ్మంలో ప్రభుత్వ వైద్యురాలిగా, తర్వాత నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో ఎయిడ్స్ కంట్రోల్ నోడల్ అధికారిగా సేవలందించి పదవీ విరమణ చేశారు. తల్లి వైద్యురాలిగా అందిస్తున్న సేవలు.. ఆరోగ్యం మెరుగయ్యాక వైద్యసేవలు పొందినవారు ఇచ్చే గౌరవమర్యాదల్ని చూసి వైద్యవృత్తిని ఎంచుకున్నానంటారు కృష్ణప్రశాంతి. ఈమె కూడా ఎస్‌వీఎంసీˆ నుంచి 1989లో ఎంబీబీఎస్ చేశారు. ఆపైన కర్నూలు వైద్య కళాశాలలో 2002లో జనరల్ మెడిసిన్‌లో పీజీ చేశారు. 2005లో చిత్తూరు జిల్లా పాకాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధుల్లో చేరారు. తర్వాత కొన్నాళ్లు ఎస్‌విఎంసీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సేవలందించారు.
వైద్యురాలిగానే కాదు, ఐఎమ్‌ఏ మహిళా విభాగం జాతీయ సభ్యురాలిగా, అకాడమీ ఆఫ్ మెడికల్ స్పెషాలిటీ ఐఎంఏ రాష్ట్ర ఛైర్‌పర్సన్, రాష్ట్ర ఫిజీషియన్ సంఘం వైస్ ఛైర్‌పర్సన్‌గానూ వ్యవహరిస్తున్నారు. అమ్మమ్మ సరోజ, అమ్మ కృష్ణప్రశాంతి స్ఫూర్తితో వైద్యవృత్తిలోకి ప్రవేశించారు హర్షిత. కర్ణాటకలోని దేవరాజ్ వైద్యకళాశాల నుంచి ఎంబీబీఎస్ చేసిన హర్షిత తమ హాస్పిటల్‌లో సేవలు అందిస్తూ పీజీకి సిద్ధమవుతున్నారు. తిరుపతిలో చదువుకున్న సమయంలో అమ్మమ్మతో కలిసి రుయా ఆసుపత్రికి వెళ్లి ఆమె వైద్యసేవలందించడం చూసి స్ఫూర్తి పొందానంటారు.
హర్షిత మెడిసిన్ చేస్తానన్నప్పుడు.. ‘డాక్టర్‌గా వ్యక్తిగత జీవితంలో ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. నేను మీకు తగినంత సమయం కేటాయించలేకపోయా.. ఇటువైపు వచ్చేముందు బాగా ఆలోచించుకో’ అని కృష్ణప్రశాంతి సూచించినా.. ప్రజాసేవకి దీన్ని మించిన వృత్తిలేదనిపించిదంటారు హర్షిత. ఈ వారసత్వం తర్వాతి తరాలకూ సాగితే సంతోషమంటున్నారీ తల్లీతనయలు.
ఇదీ చదవండి :