Telugu students in Ukraine: ఉక్రెయిన్‌లో ఉన్న రాష్ట్ర విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చేందుకు వీలుగా.. అక్కడి సరిహద్దు దేశాలకు ప్రతినిధుల బృందాలను పంపేందుకు సీఎం జగన్ అంగీకరించారు. పోలండ్, హంగరీ వంటి దేశాలకు ప్రతినిధులను పంపితే ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతానికి వచ్చే విద్యార్థులను సమన్వయం చేసి తీసుకొచ్చేందుకు వీలుంటుందని దిల్లీలోని ఏపీ భవన్ ముఖ్య రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ ప్రతిపాదించగా దీనికి సీఎం అంగీకరించారు.
కుటుంబీకులతో మాట్లాడుతున్న రెవెన్యూ సిబ్బంది: ఉక్రెయిన్‌లో ఉంటున్నట్లు అధికారులు గుర్తించిన విద్యార్థుల జాబితా ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సిబ్బంది బుధవారం వారి ఇళ్లకు వెళ్లి కుటుంబీకులతో మాట్లాడారు. 555 మంది ఇళ్లకు ఆయా అధికారులు వెళ్లినట్లు టాస్క్‌ఫోర్స్ కమిటీ తెలిపింది.
బుధవారం 33 మంది రాక..ఉక్రెయిన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి చెందిన 80 మంది విద్యార్థులను తీసుకొచ్చినట్లు ఏపీలోని ఉక్రెయిన్ టాస్క్‌ఫోర్స్ కమిటీ తెలిపింది. గత నెల 26న 10 మంది, 27న 17 మంది, 28న 11 మంది, ఈ నెల ఒకటిన తొమ్మిది మంది, 2న (బుధవారం) 33 మంది వచ్చారని వెల్లడించింది. దిల్లీ, ముంబయి విమానాశ్రయాలకు చేరుకున్న వీరిని కనెక్టింగ్ విమానాల ద్వారా విజయవాడ, విశాఖపట్నం, రేణిగుంట, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై విమానాశ్రయాలకు తీసుకొచ్చి, స్వస్థలాలకు పంపేలా ఏర్పాట్లు చేశామని వివరించింది.
ఇదీ చదవండి: రెండోసారి పుతిన్‌తో మోదీ ఫోన్ సంభాషణ