SERP: గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) పరిధిలోని గ్రామ సమాఖ్యలను (వీవో) పునర్వ్యవస్థీకరించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను సమాఖ్య పరిధిలోని డ్వాక్రాసంఘాలను విలీనం చేయాలని నిర్ణయించింది. ఒక్కో సమాఖ్య పరిధిలో కనీసం 30-50 వరకు సంఘాలు ఉండేలా విలీనానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నెలాఖరుకల్లా ప్రక్రియ పూర్తిచేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇటీవల పంచాయతీరాజ్‌శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు సెర్ప్‌పై నిర్వహించిన సమీక్షలో యానిమేటర్ల పరిధిలోనూ 30-50 వరకు సంఘాలుండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాజా ఉత్తర్వుల్లో యానిమేటర్ల అంశాన్ని ప్రస్తావించకుండా గ్రామసమాఖ్యల పునర్వ్యవస్థీకరణను తెరమీదకు తెచ్చారు. దీంతో తమ ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందని యానిమేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
30లోపు సంఘాలున్నవే అధికం..
రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో 28,405 గ్రామ సమాఖ్యలు ఉన్నాయి. వీటి పరిధిలో 8.60 లక్షల డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. మైదాన ప్రాంతాల్లో 26,451, గిరిజన ప్రాంతాల్లో 1,954 సమాఖ్యలు ఉన్నాయి. ఒక్కో సమాఖ్య పరిధిలో 8-80 సంఘాలు, అపై కూడా ఉన్నాయి. మైదాన ప్రాంతాల్లో 30లోపు సంఘాలున్న సమాఖ్యలు 14,078 ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో 30పైగా సంఘాలున్న గ్రామ సమాఖ్యలు 95 మాత్రమే ఉండగా 1,859 సమాఖ్యల్లో 1-30 లోపు సంఘాలున్నాయి. గ్రామ పంచాయతీని ప్రాతిపదికగా తీసుకుని సమాఖ్యలను పునర్వ్యవస్థీకరిస్తారు. 30లోపు ఉన్న సంఘాలను విలీనాన్ని చేస్తున్నారు.
యానిమేటర్ల ఉద్యోగాలకు ఎసరు?
గ్రామ సమాఖ్యల్లోని డ్వాక్రా సంఘాల సంఖ్యకు అనుగుణంగా గతంలో యానిమేటర్లు నియామకం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 28,000 మంది యానిమేటర్లు ఉన్నారు. గ్రామ సమాఖ్యల పునర్వ్యవస్థీకరణతో ఇద్దరు, ముగ్గురు యానిమేటర్ల పరిధిలోని సంఘాలన్నీ ఒకే సమాఖ్య పరిధిలోకి వస్తాయి. వాటి నిర్వహణ చూస్తున్న యానిమేటర్లు తమ పరిస్థితి ఏమిటని అధికారులను ప్రశ్నిస్తున్నారు. విలీనం జరిగినా కేటాయించిన సంఘాల నిర్వహణకు సంబంధించిన కార్యకలాపాల్ని ఆయా యానిమేటర్లే నిర్వహించుకోవచ్చని క్షేత్రస్థాయిలో అధికారులు వారికి చెబుతున్నారు. అయితే మంత్రి ఆదేశాల మేరకు 30-50 సంఘాల నిబంధన తమకు వర్తింపచేస్తే కొంతమంది ఉద్యోగాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని యానిమేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు కోత వేసేందుకే ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ అంశాన్ని తెరమీదకు తెచ్చిందని యానిమేటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ధనలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే 15 సంఘాల లోపు ఉన్న యానిమేటర్లకు గతేడాది ఏప్రిల్ నుంచి ప్రభుత్వం రూ. 8,000 వేతనం చెల్లించడం లేదన్నారు. గ్రామ సమాఖ్యల నుంచి అందే రూ. 2,000తోనే వారు నెట్టుకొస్తున్నారని చెప్పారు. గ్రామ సమాఖ్యల పునర్వ్యవస్థీకరణ ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకోవాలని అధికారుల్ని కోరతామన్నారు. వారి నిర్ణయాన్ని బట్టి తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
ఇవీ చదవండి: