రాష్ట్రంలో వచ్చే ఏడాది పొగాకు పంట సాగు విస్తీర్ణాన్ని 20 శాతం తగ్గించేందుకు నిర్ణయించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రాష్ట్రంలో 79,384 హెక్టార్లలో పొగాకు సాగు చేస్తున్నారని, దాని స్థానంలో ప్రత్యామ్నాయ పంటలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. పొగాకు రైతుల ఇబ్బందులపై ‘పొగాకు రైతు దిగాలు’ శీర్షికన ఈ నెల 24న ‘ఈనాడు’లో వచ్చిన కథనానికి స్పందనగా... గుంటూరులోని భారత పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయంలో బోర్డు అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు, ఐటీఏ నాయకులు, పొగాకు కంపెనీల ప్రతినిధులతో మంత్రి కన్నబాబు మంగళవారం సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... ప్రస్తుత ఏడాదిలో 137 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి రాగా ఇప్పటికి 16.30 మిలియన్ కిలోలనే వ్యాపారులు కొనుగోలు చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం నుంచి ఎక్కువ మొత్తంలో కొనడంతో పాటు ధరనూ పెంచాలన్నారు. ఐటీసీ మాత్రమే పొగాకును కొంటోందని, మిగిలిన కంపెనీలూ రైతుల నుంచి కొనాల్సిందేనని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 'కృష్ణాపై కట్టే ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం జరగదు'