వైభవ్ జ్యువెల్లర్స్ ఛైర్‌పర్సన్, ఎండీ గ్రంథి మల్లికా మనోజ్ స్ఫూర్తి గాథను ఆమె మాటల్లోనే తెలుసుకుందాం...
2012లో... మా జీవితాల్ని తలకిందులు చేసిన రోజది. ఆయన వ్యాపారం పని మీద బెంగళూరు వెళ్లారు. తన ఫోన్ కోసం చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నా. ఇంతలో ఫోన్ మోగితే సంతోషంగా తీశా. గుండెలు పగిలే అలాంటి వార్త వినాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ఆయన్ని దొంగలు హత్య చేశారని చెబుతున్నారు ఫోన్‌లో ఎవరో. ఒక్కసారిగా మా ఆశల సౌధాలు, కలలు కూలిపోయాయి.
ఓవైపు ముగ్గురమ్మాయిలు, చిన్నదానికి ఊహ కూడా తెలియదు. మరోవైపు మమ్మల్ని నమ్ముకున్న 400 కుటుంబాలు. మా వారికి వీళ్లే రెండు కళ్లు. ఆయన లేనప్పుడు వీళ్లందరికీ నేనే ఆధారం కదా. దుఖ:పడుతూ కూర్చుకునే హక్కు నాకు లేదు. అందుకే కళ్ల నీళ్లు తుడుచుకున్నా. గుండె రాయి చేసుకున్నా. దాని మీద ఆయన చిత్రాన్ని చెక్కుకుని వ్యాపారాన్ని నా చేతుల్లోకి తీసుకున్నా. అలా అని నేనేమీ పెద్దగా చదువుకోలేదు.
పెళ్లినాటికి నాకు 19 ఏళ్లు. మాది గుంటూరు. నాన్న వ్యాపారి, అమ్మ గృహిణి. పెళ్లి కుదరడంతో డిగ్రీ మధ్యలోనే ఆపేశా. మావారు గ్రంథి మనోజ్‌ది ఏలూరు. మా ఇద్దరికీ రెండేళ్లే తేడా. దీంతో మా మధ్య మంచి స్నేహముండేది. అత్తింటివారూ ఆప్యాయంగా చూసుకునేవారు. వాళ్లది వస్త్రవ్యాపారం. మా పెళ్లయ్యాక నగల వ్యాపారంలోకి అడుగుపెట్టారు. మా వారికి దీన్ని బాగా అభివృద్ధి చేయాలనే కోరిక. అందుకోసం 1994లో వైజాగ్ వచ్చాం. అప్పటికే మాకు ఇద్దరమ్మాయిలు. ముగ్గురు ఉద్యోగులతో చిన్న షోరూం ప్రారంభించాం. తర్వాత విదేశాల్లో ఉండే వారికీ ఆభరణాలను అందించాలని ఏటా అమెరికాలో ప్రదర్శనలు నిర్వహించే వాళ్లం.
వీ స్క్వేర్ పేరుతో 2007లో భారీ షోరూంను ఏర్పాటు చేశాం. మావారు నాలుగేళ్లు ఎన్నో ఇబ్బందులకు ఎదురొడ్డి దానికి రూపమిచ్చారు. ఇంటికీ, వ్యాపారానికి సమ ప్రాధాన్యమిచ్చే వారాయన. రోజూ నాతో, పిల్లలతో తప్పక సమయం గడిపేవారు. ఏ పూటైనా ఇద్దరం కలిసి భోజనం చేయాల్సిందే. రత్నాల్లాంటి ముగ్గురు కూతుళ్లు... 400 మంది ఉద్యోగుల కుటుంబం మాది. ఆనందమంతా నాదే అనుకునేదాన్ని. అందుకే దిష్టి తగిలిందేమో.. తనకలా అయింది.
మనోజ్‌కి ఎన్నో ఆలోచనలుండేవి. పెద్ద పిల్లలకు అప్పటికే 19, 17 ఏళ్లు. వాళ్లూ నాకు తోడుగా నిలిచారు. తన కలల్ని నెరవేర్చడమే ఆయనకు మేమిచ్చే నివాళిగా భావించాం. మా ‘వైభవ్’ కుటుంబమూ నాతో నడవడానికి ముందుకొచ్చింది. డిగ్రీ అయినా పూర్తి చేయలేదు. ఏ ధైర్యంతో ముందుకొచ్చా అనిపించొచ్చు. పెళ్లైనప్పటినుంచి ఆయన్ని గమనిస్తున్నా. రోజూ ఏం జరిగింది, ఎదురైన సమస్యలు, వాటిని ఎదుర్కొన్న తీరు... అన్నీ నాతో చెప్పేవారు. సలహాలూ తీసుకునే వారు. ప్రతిదీ చర్చించుకునే వాళ్లం. వర్క్‌షాపులకీ వెళ్లే దాన్ని. దీంతో బాగా అవగాహన ఏర్పడింది. పెళ్లయ్యాక నేర్చుకున్న కంప్యూటర్, హిందీ పరిజ్ఞానముంది. కొంతైనా సాయపడొచ్చని ఆయన పని విధానాన్నీ గమనించేదాన్ని. ఇవన్నీ తోడ్పడ్డాయి.
ఆయన చనిపోయేనాటికి 3 షోరూమ్‌లూ, రూ.350 కోట్ల టర్నోవర్ ఉండేది. అక్కడ్నుంచి జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వచ్చాం. కొత్త విధానాలు ప్రవేశపెట్టాం. షోరూంకి వచ్చే సమయం లేనివారి కోసం ‘లైవ్‌వీడియో’, ఆన్‌లైన్ ఆర్డర్ వంటి ప్రయోగాలు చేశాం. ఫలితమే 13 షోరూమ్‌లు, సుమారు రూ.1500 కోట్ల టర్నోవర్. ఉద్యోగులూ 1100 మంది అయ్యారు. 22 దేశాలకు నగలు పంపుతున్నాం. ఉత్తరాంధ్రతోపాటు హైదరాబాద్‌లోనూ షోరూమ్‌లున్నాయి. ఉద్యోగుల తోడ్పాటే దీనికి కారణం. అందుకే వాళ్ల పిల్లల్లో సుమారు వంద మందికి ఏటా ఆర్థికసాయం చేస్తున్నాం. 464 గ్రామాల్లోని 502 పాఠశాలలు, 43 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మౌలిక సదుపాయాల్ని సమకూర్చాం. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి సహా ఎన్నో అవార్డులనూ అందుకున్నా. ఇవన్నీ నాపై బాధ్యత పెంచేవే. పెద్దమ్మాయి దంత వైద్యురాలు, తనే చిన్నపాపనీ, ఇంటి వ్యవహారాలనూ చూసుకునేది. రెండో అమ్మాయి సీఏ చేసింది. ఇద్దరూ సంస్థ వ్యవహారాల్లో పాలు పంచుకుంటున్నారు. చిన్నపాప ఇంటర్ చదువుతోంది. మా నలుగురి మధ్యా బలమైన బంధం ఉండేలా చూసుకున్నా. దీంతో ఇల్లు, వ్యాపారం సమన్వయం కుదిరింది. ఆయనెప్పుడూ ఓ మాట చెప్పే వారు.. ‘మనమే ఎదగాలనుకోకూడదు. నలుగురినీ కలుపుకొంటూ వెళ్లాలి. అదే అసలైన నాయకత్వం’ అని. ఇదే అనుసరిస్తున్నా.
నేనే అన్నది పక్కన పెట్టేయాలి. అందరినీ కలుపుకొంటూ వెళ్లాలి. ఒకరు చేసిన దానికీ నలుగురు పంచుకొని చేసినదానికీ తేడా ఉంటుంది కదా! అలాగే ఏం కావాలన్న దానిపై ముందు మీకు స్పష్టత ఉండాలి. అప్పుడే ఎదుటివారికీ మీరు చెప్పేది అర్థమవుతుంది. ఇంటికీ, పనికీ సమ ప్రాధాన్యమివ్వాలి. ఎక్కడి ఒత్తిళ్లను అక్కడ వదిలేయాలి. అప్పుడే రెండింటి సమన్వయం సాధ్యం. నేను పాటిస్తూ, సూచించే సలహా ఇది.
ఇదీ చదవండి: Prasanna sri: గిరిజనుల పరిస్థితులు, భాషలపై పరిశోధన.. ప్రసన్నశ్రీని వరించిన ‘నారీశక్తి’ పురస్కారం