స్కంద పురాణం అంతర్గతంగా ఉన్న కార్తిక పురాణం అయిదో అధ్యాయంలోని నీతి కథలో ఇదంతా కనిపిస్తుంది. జనక మహారాజుకు వశిష్ఠుడు సర్వపాప క్షయకరమైన కార్తిక మాస విశేషాలను వివరించసాగాడు. కార్తిక మాసంలో శ్రీమహా విష్ణువు సన్నిధిలో భగవద్గీత పారాయణ చేయడం ఎంతో శుభప్రదం.
కార్తిక పురాణం కథ
పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే వేద వేదాంగ పండితుడు ఉండేవాడు. ఆయనకు జన్మించిన కుమారుడు మాత్రం తండ్రి మాట వినకుండా తిరుగుతూ ఉండేవాడు. ఓ సంవత్సరం కార్తికం ప్రవేశించగానే ఆ మాస పవిత్రతను చెప్పి వ్రతాన్ని ఆచరించమన్నాడు దేవశర్మ. కానీ, కుమారుడు తండ్రి మాటను తిరస్కరించటమే కాక నాస్తిక ధోరణిలో తండ్రిని ఎదిరించాడు. దాంతో తండ్రికి కోపం మితిమీరి ఎలుకగా పుట్టమని శపించాడు. అప్పటికి ఆ కుమారుడికి జ్ఞానోదయమైంది. తప్పు క్షమించమని తండ్రి కాళ్ల మీద పడ్డాడు. తండ్రి కరుణించి ఎప్పుడు కార్తిక మహత్వాన్ని వింటావో అప్పుడు పాప విమోచనం కలుగుతుందని చెప్పాడు.
ఆ తర్వాత కొద్ది సమయానికే దేవశర్మ కుమారుడు ఎలుకగా మారి సమీప అరణ్యంలో ఉన్న ఓ చెట్టు తొర్రలో నివసించసాగాడు. ఇంతలో ఓ రోజున విశ్వామిత్రుడు తన శిష్యులతో కలిసి ఆ పరిసరంలో ఉన్న కావేరీ నదిలో స్నానమాడటానికి వచ్చాడు. ఆ తర్వాత ఎలుక ఉన్న చెట్టు దగ్గరకొచ్చి తన శిష్యులతో కార్తిక మహత్వాన్ని చెప్పటానికి, హరి పూజకు సంసిద్ధుడయ్యాడు. ఇంతలో ఓ దారి దోపిడీ వేటగాడు అక్కడున్నది సామాన్య మునులనుకొని... వారిని బాధించి, వారి దగ్గరున్న వస్తువులను తీసుకెళ్లటానికి వచ్చాడు. కానీ, ఆ సజ్జన దర్శనంతో అతడిలోని పాపపు ఆలోచనలన్నీ పోయి సాత్వికుడిగా మారి విశ్వామిత్రుడి కాళ్ల మీద పడ్డాడు. తనలో ఏదో తెలియని మార్పు వచ్చిందని, అది తనకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని కనుక తనకు ఇంకా ఏదైనా మంచి విషయాన్ని బోధించి ముక్తి లభించేలా చేయమని ప్రార్థించాడు.
విశ్వామిత్రుడు వెంటనే కార్తిక వ్రత మహత్వం గురించి చెప్పి కార్తిక పురాణాన్ని వినిపించాడు. జరుగుతున్నదంతా చెట్టు తొర్రలో నుంచి చూస్తున్న ఎలుకకు శాప విముక్తి కలిగి అసలు రూపం లభించింది. అప్పుడు ఆ దేవశర్మ కుమారుడు విశ్వామిత్రుడి కాళ్లమీద పడి విషయమంతా చెప్పి ఆయన ఆశీర్వాదం పొంది ఇంటికి తిరిగి వెళ్లాడు. బోయ కూడా ఆనాటి నుంచి పూర్తిగా హింసకు దూరమై అత్యంత కాలంలో ముక్తిని పొందాడు.
తల్లితండ్రులను ఎదిరించిన వాడు కష్టాల పాలవుతాడు
ఇదంతా పూజ, వ్రతం, పురాణ కథ అని కొట్టి పారేయనక్కరలేదు. తల్లిదండ్రులను ఎదిరించిన వాడు కష్టాల పాలవుతాడని సజ్జన దర్శనం, సాంగత్యం మనిషిలో మంచి మార్పును తెస్తాయని చెప్పే సందేశాన్ని గమనించి ఆచరించవచ్చు.
స్వామివారికి కార్తిక పూజలు
భగవద్గీతలో ఉన్న విభూతి, విశ్వరూప, సందర్శనాధ్యాయాలను పారాయణ చేయాలి. అలా చేయటం వల్ల వైకుంఠవాసార్హత లభిస్తుంది. శ్రీమహా విష్ణువును తులసీ దళాలతోనూ, తెల్లనివి, నల్లనివి అయిన అవిశ పూలతోనూ, గన్నేరు పూలతోనూ పూజించటం ఎంతో మేలు. ఈ మాసంలో హరి సన్నిధిలో కార్తిక పురాణంలోని ఒక శోక్లాన్ని విన్నా లేదా ఒక శ్లోక పాదాన్ని చెప్పినా, విన్నా కర్మ బంధ విముక్తి లభిస్తుంది.
వన భోజనం పాపనాశకం..!
కార్తిక శుక్ల పక్షంలో వన భోజనం కూడా పాపనాశకరమే. ఈ మాసంలో చేసే జపాలు, హోమాలు అన్నీ రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయి. సర్వపాపాలనూ నశింపచేస్తాయి. వన భోజనం విషయంలో ముందుగా వనంలో ఉన్న ఉసిరి చెట్టు దగ్గర సాలగ్రామాన్ని ఉంచి గంధ పుష్పాదులతో పూజించి భక్తితో ముందుగా వేద పండితులకు భోజనం పెట్టాలి. ఆ తర్వాత మిగిలిన వారు భోజనం చేయాలి.
ఇదీ చూడండి: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు