రాష్ట్రంలో 2024 నుంచి ఏటా 3 వేల మెగావాట్ల చొప్పున మూడేళ్లలో మొత్తం 9 వేల మెగావాట్ల సామర్థ్యం ఉన్న సౌరవిద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకోవడానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) ఆసక్తి వ్యక్తంచేసింది. వీటి ఏర్పాటుతో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని అభిప్రాయపడింది. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌కు సెకీ జనరల్ మేనేజర్ అతుల్యకుమార్ నాయక్ లేఖ రాశారు. ఇందులో ‘పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించటంలో రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవ అభినందనీయం. వ్యవసాయానికి పగలే విద్యుత్ అందించే చర్యలను ప్రభుత్వం చేపట్టింది. ఇది డిస్కంలపై భారం పడదు, రైతులకూ మేలు కలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 6,400 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు టెండర్లను పిలిచింది. ఇందులో కొందరు యూనిట్ రూ.2.49 వంతున సరఫరా చేయటానికి బిడ్ దాఖలు చేశారు’ అని లేఖలో పేర్కొంది.
* కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించటానికి సౌర విద్యుత్ టెండర్లను 2019 నవంబరులో నిర్వహించింది. నాలుగు దశల్లో.. ఏటా 3 గిగావాట్ల సౌరవిద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్రం నుంచి సెకీ అనుమతి పొందింది. ఈ ప్రాజెక్టులకు అంతర్రాష్ట్ర సరఫరా ఛార్జీలను కేంద్రం మినహాయించింది. మొదటిదశలో ఏర్పాటుచేసిన ప్రాజెక్టులు 2023 సెప్టెంబరు నాటికి ఉత్పత్తిలోకి వచ్చే అవకాశం ఉంది. మిగిలిన మూడు దశల్లో ప్రతిపాదించిన ప్రాజెక్టులు 2024, 25, 26లో అందుబాటులోకి వస్తాయి. టెండరు నిబంధన ప్రకారం దేశంలో ఏటా 3 గిగావాట్ల సౌర విద్యుత్ పరికరాల తయారీ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టును ఏర్పాటుచేయాలి.
* మూడు దశల్లో ఏడాదికి 3 మెగావాట్ల వంతున.. 9 వేల మెగావాట్ల ప్రాజెక్టులు ఏర్పాటుకు అవకాశం ఉంది. సెకీ నుంచి లెటర్ ఆఫ్ అవార్డు (ఎల్‌వోఏ) పొందిన సంస్థలు వాటిని ఏర్పాటు చేస్తాయి. ఈ పథకం కింద ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల నుంచి సెకీ వాణిజ్య లాభాలతో కలిపి యూనిట్‌ను రూ.2.49కే సరఫరా చేస్తుంది.
ఉత్పత్తి ఆధారిత విద్యుత్ సరఫరా ఒప్పందాలు (పీఎస్‌ఏ) వల్ల ప్రయోజనాలు
* ఈ పథకం కింద సెకీ నుంచి ఎల్‌వోఏ పొందిన డెవలపర్లు అన్ని ఖర్చులూ కలిపి యూనిట్ రూ.2.49కే సరఫరా చేస్తారు.
*తక్కవ టారిఫ్‌కే 25 ఏళ్ల పాటు విద్యుత్ అందటం వల్ల వ్యవసాయ విద్యుత్‌కు అందించే రాయితీ మొత్తంలో భారీగా ప్రభుత్వానికి ఆదా అవుతుంది.
*విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) అమల్లో ఉన్న 25 ఏళ్ల పాటు అంతర్ రాష్ట్ర విద్యుత్ సరఫరా ఛార్జీలకు (ఐఎస్‌టీఎస్) కేంద్రం మినహాయింపు ఇస్తుంది. ప్రాజెక్టు ప్రారంభించిన తేదీతో సంబంధం లేకుండా పీపీఏ వ్యవధికి మినహాయింపు వర్తిస్తుంది.
* సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములు వ్యవధి ముగిసిన తర్వాత భవిష్యత్‌లో ప్రభుత్వం చేపట్టే ఇతర ప్రాజెక్టుల కోసం ఆ భూములను వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
* ఏటా 3 వేల మెగావాట్ల ప్రాజెక్టులను ఏర్పాటు చేయటం వల్ల డిస్కంలు, ట్రాన్స్‌కో రాష్ట్ర విద్యుత్ అవసరాలకు అనుగుణంగా సమన్వయం చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. 6,400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు టెండరు ప్రకటనలో ప్రభుత్వం పేర్కొన్న ఇంటిగ్రేషన్, బ్యాలెన్సింగ్ వ్యయం భారం కూడా తగ్గుతుంది.
సెకీ ప్రాజెక్టు ఆమోదిస్తే.. 10 వేల మెగావాట్ల ప్రతిపాదన పక్కకు
సెకీ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తే.. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం 10 వేల మెగావాట్ల సౌర ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను ఉపసంహరించుకునే అవకాశం ఉందని విద్యుత్‌రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ప్రాజెక్టు కోసం టెండర్ల ప్రక్రియ వివాదాస్పదం అయ్యిందన్నారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గంలో ఒక ప్రైవేటు కార్పొరేట్ సంస్థకు రాష్ట్రంలోని సౌరవిద్యుత్ ప్రాజెక్టులు దక్కించుకునే ప్రయత్నాలుగా పేర్కొన్నారు. దీనికోసమే సెకీ ద్వారా మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నారని, 25 ఏళ్ల పాటు ప్రభుత్వం 9 వేల మెగావాట్ల సౌర ప్రాజెక్టుల నుంచి విద్యుత్ తీసుకోవాల్సి వస్తుందన్నారు.
ఇదీ చదవండి: NCRB: రాష్ట్రంలో నేరాలు 15 శాతం తగ్గాయి