దక్షిణ మధ్య రైల్వేకు కోట్లలో విద్యుత్ బిల్లు వస్తుంది. కరెంట్ కోసం కోట్ల రూపాయలు వెచ్చించకుండా అధికారులు ఓ ఉపాయాన్ని ఆలోచించారు. రైల్వే బిల్డింగులు, స్టేషన్లు, కార్యాలయాల్లోని పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసే యోచన చేశారు. రైల్వే వద్ద ఉన్న నిధులతో ఎన్ని భవనాలపై సోలార్ పైకప్పులు ఏర్పాటు చేయవచ్చని సమీక్షించారు. ఈ విధంగా సోలార్ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది.
సోలార్ పైకప్పులు
దేశంలో ఎక్కడా లేని విధంగా దక్షిణ మధ్య రైల్వే... 13 రైల్వే స్టేషన్లపై ఎనర్జీ న్యూట్రన్ స్టేషన్స్ ఏర్పాటు చేసింది. ఘట్కేసర్, ధరూర్, రఘునాథపల్లి, మేళ్లచెరువు, ధర్మాబాద్, శివంగం, ఉమ్రి, కల్కేల్, బొల్సా, ఒంటిమిట్ట, ద్వారాపుడి, గోదావరి, కడియం రైల్వే స్టేషన్లలో రూ.52 లక్షలతో సోలార్ పైకప్పులు బిగించింది.
8 స్టేషన్లలో అందుబాటులో
నంద్యాల-యర్రగుంట్ల మార్గంలో 8 స్టేషన్లుంటాయి. ఇది మారుమూల ప్రాంతం కావడం వల్ల తరచూ విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది. సౌర విద్యుత్ ఏర్పాటు చేయడం వల్ల నిరంతరం లైట్లు, యూటీఎస్, స్టేషన్ పరికరాలకు అవసరమైన విద్యుత్ అందుబాటులో ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
కామారెడ్డి రైల్వే స్టేషన్‌పై పూర్తి స్థాయిలో స్పెషల్ సోలార్ ఫొటో వలెటిక్ 18 ఎస్.ఈ.బీ ప్యానళ్లు ఏర్పాటు చేశారు. వీటితో 5.76 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. గుంతకల్ రైల్వే స్టేషన్ వద్ద వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఉల్టా - చాతా(గొడుకు తిరగేసిన ఆకారం) నిర్మాణాలను చేపట్టి వాటిపై సోలార్ ప్యానెళ్లు బిగించారు. సికింద్రాబాద్ రైల్ నిలయంపై 100 కిలో వాట్ల సోలార్ పైకప్పు నిర్మించారు. దీనివల్ల 40 శాతం విద్యుత్, ఏడాదికి రూ.13లక్షలు ఆదా అవుతోందని అధికారులు తెలిపారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పై ఏర్పాటుచేసిన సోలార్ ప్యానెళ్లతో వెయ్యి కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని, 80 శాతం విద్యుత్ ఆదా చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ విధంగా మొత్తంగా పీపీపీ విధానంలో 4.9 మెగావాట్లు, రైల్వే సొంత ఖర్చుతో 3.4మెగావాట్ల సోలార్ విద్యుత్ ఏర్పాటు చేశారు.
దేశంలోనే మొదట
పీపీపీ విధానం వల్ల సుమారు రూ.2.9 కోట్లు, రైల్వే సొంత ఖర్చుతో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానళ్లతో రూ.1.3కోట్లు ఆదా చేయగలుగుతున్నామని రైల్వే ప్రజా సంబంధాల ముఖ్య అధికారి రాకేష్ తెలిపారు. దేశంలో రైల్వే స్టేషన్లు, కాలనీల్లో 100 శాతం ఎల్ఈడీ బల్బులు వినియోగిస్తున్న రైల్వేగా దక్షిణ మధ్య రైల్వే పేరు సంపాదించిందని వివరించారు.