ధరాఘాతంతో మరింత మంట
ఆదాయం తగ్గడంతో పాటు నిత్యావసరాలు, పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడం వీరికి శరాఘాతమవుతోంది. 20 రోజుల కిందటి వరకూ రోజుకు రూ.వెయ్యి వరకూ సంపాదిస్తుండగా.. ఇప్పుడు రూ.600 లోపు మాత్రమే వస్తున్నట్లు విజయవాడకు చెందిన ఆటోడ్రైవర్లు వేణు, శ్రీనివాస్ చెప్పారు. వచ్చే సంపాదనలో సగం డీజిల్, గ్యాస్ ఖర్చులకే పోతోందని, కుటుంబం గడవడం కష్టంగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాజిటివ్ కేసులు పెరగడంతో ఆదాయం తగ్గిపోతున్న వారిలో సొంతంగా వ్యాపారం చేసుకునేవారు, కులవృత్తుల మీద ఆధారపడ్డ పేదలే ఎక్కువ మంది ఉన్నారు. ఈ పనులన్నీ ఎక్కువగా చేతులతో చేసేవి కావడంతో వైరస్ వ్యాపిస్తుందేమోనన్న భయంతో జనం వీరి సేవలను వినియోగించుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. అల్పాహారం విక్రయించేవారికి గిరాకీ తగ్గిపోవడానికీ ఇదే కారణమవుతోంది.
వ్యాపారం తక్కువ.. ఆపై కొవిడ్
* చిరుతిళ్లు విక్రయించేవారికి, బేకరీ నిర్వాహకులకు వేసవి కారణంగా వ్యాపారం కొంత తగ్గుతుంది. దీనికితోడు కరోనా కేసులు పెరుగుతుండటంతో వ్యాపారం మరింత నెమ్మదిస్తోంది. గత కొంతకాలంగా నిత్యావసరాల ధరలు పెరగడం, దీనికి అనుగుణంగా వ్యాపారం లేకపోవడంతో నష్టం వస్తోంది.
* వస్త్రవ్యాపారం మార్చి మూడో వారం నుంచే తగ్గుముఖం పట్టినట్లు విజయవాడకు చెందిన వ్యాపారులు చెబుతున్నారు. రమారమి 30 శాతం వరకూ గిరాకీ తగ్గిపోయినట్లు వివరించారు.
* దుస్తులు ఇస్త్రీ చేయించుకునేందుకు ఎక్కువ మంది ఇష్టపడటం లేదు. ఇంటికే వచ్చి దుస్తులు ఉతుకుతామని చెప్పినా వద్దంటున్నారని విజయవాడకు చెందిన పామర్తి వెంకటేశ్వరరావు వాపోయారు.
రోజుకు రూ.300 మిగలడం లేదు
బిర్యానీ, పలావు అమ్మగా రోజూ రూ.700 వరకూ లాభం వచ్చేది. ఇప్పుడు రూ.300 కూడా మిగలడం లేదు. గిరాకీ తగ్గడంతో పాటు నూనె, కోడి, గుడ్డు ధరలు అమాంతం పెరిగిపోవడంతో గిట్టుబాటు కావడం లేదు. ఆదాయం తగ్గిపోయి ఈసారి బ్యాంకు రుణం వాయిదా కట్టలేకపోయా. ఇద్దరం దీనిపైనే ఆధారపడ్డాం. - మహ్మద్ అసిఫ్, గంగూరు, పెనమలూరు, కృష్ణా జిల్లా
అద్దె కట్టుకోవడానికీ అగచాట్లు
కరోనా భయంతో మూడు వారాల నుంచి సెలూన్‌కు వచ్చే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. రోజుకు 10 మంది మించి రావడం లేదు. వచ్చే అంతంత మాత్రం ఆదాయంలో దుకాణంలో పనిచేసే వ్యక్తికి జీతమివ్వడం, అద్దె కట్టుకోవడం ఇబ్బందిగా ఉంది. కరోనా భయానికి ఎక్కువ మంది ట్రిమ్మర్లు వంటివి కొనుక్కోవడంతో పని తగ్గింది.- ఆకునూరి సుబ్బారావు, క్షౌరశాల యజమాని, విజయవాడ
వ్యాపారం 30 శాతం తగ్గింది
బేకరీ ద్వారా రోజూ రూ.10 వేల వరకూ వ్యాపారం జరిగేది. ఇప్పుడు రూ.7 వేలు దాటడం లేదు. వేసవికి తోడు కరోనా ప్రభావంతో మరింత దిగజారింది. జనం ఇంతకుముందులా చిరుతిళ్లపై ఆసక్తి చూపించడం లేదు. సరకుల ధరలు పెరిగి పెట్టుబడి ఎక్కువవుతోంది. మరోవైపు కరోనాతో ఇంతకుముందు పరిస్థితి మళ్లీ వస్తుందేమోనని ఆందోళనగా ఉంది. - నవీన్, ఈడుపుగల్లు
ఇదీ చదవండి: క్లైమాక్స్‌కు తిరుపతి ఉపఎన్నిక ప్రచారం..17న పోలింగ్