విశ్వవిద్యాలయాల నిధుల సంఘం విషయ నైపుణ్యాలతోపాటు వ్యక్తిగత, మానసిక వికాసానికి దోహదపడేలా పాఠ్యప్రణాళికను రూపొందిస్తోంది. ఇందుకోసం జీవన నైపుణ్యాలు (జీవన్ కౌశల్) పేరుతో కొత్త కోర్సును తెస్తోంది. మొత్తం 120 గంటలపాటు బోధన, 8 క్రెడిట్లతో కోర్సును రూపొందిస్తోంది. జీవన నైపుణ్యాలను తరగతిలో 4అంశాలుగా బోధించనున్నారు. ఒక్కో నైపుణ్యానికి 30గంటలు బోధించడంతోపాటు రెండు క్రెడిట్లు ఇస్తారు.
కమ్యూనికేషన్, వృత్తి, నాయకత్వం - నిర్వహణ నైపుణ్యాలు, మానవ విలువలపై పాఠ్యాంశాలుంటాయి. అండర్ గ్రాడ్యుయేషన్ (యూజీ) పూర్తి చేసి మార్కెట్‌లోకి వస్తున్న వారిలో నైపుణ్యాలు లేకపోవడంతో ఉద్యోగాలు రావడం లేదనే విన్నపాల నేపథ్యంలో వీటిని ప్రవేశపెడుతున్నారు. ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు అవసరమైన వాటిని ఇందులో పొందుపర్చారు. సాధారణ డిగ్రీ పొందినవారికి వీటి ద్వారా నైపుణ్యాలను పెంచనున్నారు.
బోధనతోపాటు ప్రయోగాలు
జీవన నైపుణ్యాల పాఠ్యప్రణాళికలో బోధనతోపాటు ప్రయోగాలు (ప్రాక్టికల్స్) ఉంటాయి. బోధించే ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక మాన్యువల్‌ను రూపొందిస్తున్నారు. పాఠం బోధించాక విద్యార్థిని పరీక్షించే విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ప్రాజెక్టువర్క్‌లను ఇస్తారు. దీంతో ఏ విద్యార్థి ఎంతవరకు నైపుణ్యాలను నేర్చుకోగలిగారో అంచనా వేస్తారు. తరగతిలోనే రాత, మౌఖిక పరీక్షలు నిర్వహిస్తారు. మొదటిసారి విద్యార్థుల స్వీయ మూల్యాంకన విధానాన్ని తెస్తున్నారు. కోర్సు ప్రారంభంలో సామర్థ్యం, పూర్తయిన తర్వాత పరిస్థితిపై స్వీయ మూల్యాంకనం ఉంటుంది. దీనిపై 1-10వరకు పాయింట్లు కేటాయిస్తారు. వీటి ఆధారంగా స్థాయిని అంచనా వేస్తారు.
వినడం.. మాట్లాడడం.. చదవడం
విద్యార్థులు వినడం, మాట్లాడడం, చదవడం, రాతకు ప్రత్యేక నైపుణ్యాలను అందించనున్నారు. ఈ 4అంశాలను 17గంటలు బోధించనున్నారు. ఒక అంశాన్ని ఏకాగ్రతతో వినడం, అర్థం చేసుకున్న అంశంపై సమర్థంగా మాట్లాడడం నేర్పిస్తారు. పాఠాలను చదవడంలో మెలకువలను బోధిస్తారు. ప్రస్తుతం చాలా మంది విద్యార్థుల్లో పాఠ్యపుస్తకాలు మినహా ఇతర పుస్తకాలను చదివే అలవాటు తగ్గుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఈ అంశానికి ప్రాధాన్యమిచ్చారు. రచనా నైపుణ్యాలనూ మెరుగుపరుస్తారు. మొదట చిత్తుప్రతులను రాయించడం, వాటిని సవరించడంలాంటి వాటిద్వారా రచనా విధానాన్ని నేర్పిస్తారు. కేరీర్, జట్టులో పనిచేసే విధానం, నాయకత్వంతోపాటు మానవ విలువలను బోధిస్తారు. మానవ విలువల అంశానికి 30గంటలు కేటాయించారు. ప్రవర్తన, నిజాయతీ, శాంతి, సేవ, త్యాగంలాంటి అంశాలపై అభ్యాసన ఉంటుంది. సమాజంలో యువత ప్రవర్తన అంశానికి సంబంధించి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు.
ఇదీ చదవండి: ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. తండ్రి, కుమార్తె మృతి