MAHANADU: మహానాడుకు ఒంగోలు ముస్తాబవుతోంది. మండువవారిపాలెంవద్ద ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న ఈ వేడుకలకు తెదేపా శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణంతోపాటు రక్తదాన శిబిరం, ఫొటో గ్యాలరీ, పార్కింగ్ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ప్రతిరోజూ రాష్ట్ర స్థాయి నేతలు పనులను పరిశీలిస్తున్నారు. దాదాపు 60 శాతం పనులు పూర్తయ్యాయని.. రెండు రోజుల్లో వందశాతం చేస్తామని తెదేపా నేతలు వెల్లడించారు.
తరలిరావాల్సిందిగా ఆహ్వానిస్తూ..: మహానాడుకు తొలిసారిగా ఒంగోలు వేదిక కావడంతో స్థానిక తెదేపా శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు నూకసాని బాలాజీ, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల బాధ్యులు మహానాడు ప్రాంగణానికి వచ్చి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. సోమవారం మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, బీద రవిచంద్ర, టీడీ జనార్దన్ వచ్చారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ‘బాదుడే బాదుడు’ కార్యక్రమాల్లో తెదేపా నాయకులు పాల్గొని ధరల పెరుగుదల తీరు ఎలా ఉందో ఎండగడుతూ, అదే సమయంలో మహానాడుకు తరలిరావాల్సిందిగా ప్రజలను ఆహ్వానిస్తున్నారు. ఒంగోలు నగరంలో ఇంటింటికీ తెలుగు మహిళలు వెళ్లి బొట్టుపెట్టి ఆహ్వానిస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా దాదాపు లక్ష మంది మహానాడుకు హాజరవుతారని.. రాష్ట్రంలోని ఇతర జిల్లాలు, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి మరో లక్ష మంది వరకు వస్తారని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.
వసతికి ఇబ్బంది లేకుండా: మహానాడుకు వచ్చేవారికి వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా చిత్తూరు, కడప నుంచి వచ్చే పార్టీ నాయకులు, కార్యకర్తలకు నెల్లూరులో.. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం నుంచి వచ్చేవారికి గుంటూరులో.. ఉభయగోదావరి జిల్లాల నుంచి వచ్చేవారికి విజయవాడలో.. అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి వచ్చేవారికి ఒంగోలులో వసతి, బస ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి: