తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల మార్పులపై కొలీజియం తుది నిర్ణయం తీసుకున్నా.. అందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులేమీ వెలువడలేదు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ 2019 జూన్ 23 నుంచి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జేకే మహేశ్వరి 2019 అక్టోబరు 7 నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్ రెండో ప్రధాన న్యాయమూర్తి కాగా, జస్టిస్ జేకే మహేశ్వరి విభజిత రాష్ట్రమైన ఏపీ హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల బదిలీలు, పదోన్నతులపై సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ధ్రువీకరిస్తూ తీర్మానం చేస్తుంది. తర్వాత అధికారికంగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. అనంతరం ఆ సిఫార్సులను న్యాయశాఖ ఆమోదం కోసం పంపుతుంది.
న్యాయశాఖలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్.. కొలీజియం సిఫార్సులను న్యాయశాఖ మంత్రి, ప్రధానమంత్రి పరిశీలన అనంతరం రాష్ట్రపతి ఆమోదముద్ర కోసం పంపుతుంది. రాష్ట్రపతి అందుకు ఆమోదించి వారెంట్స్ జారీచేసిన తర్వాత న్యాయమూర్తుల బదిలీలు, నియామకాలపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ గెజిట్ నోటిఫికేషన్ జారీచేస్తుంది. ఆ నిర్ణయాలు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చేదీ అందులో స్పష్టంగా చెబుతారు.
పదోన్నతిపై జస్టిస్ కోహ్లి..
జస్టిస్ హిమా కోహ్లి ప్రస్తుతం దిల్లీ హైకోర్టులో సీనియారిటీ పరంగా రెండో స్థానంలో ఉన్నారు. ఈమె పదోన్నతిపై తెలంగాణ హైకోర్టుకు రానున్నారు. 1959 సెప్టెంబరు 2న దిల్లీలో జన్మించిన జస్టిస్ కోహ్లి దిల్లీ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ చేశారు. 1984లో న్యాయవాదిగా నమోదయ్యారు. 2006లో దిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2007లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అంతకుముందు పలు ప్రధానమైన ప్రజాప్రయోజన వ్యాజ్యాల్లో ఆమె దిల్లీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. 2020లో దిల్లీ జ్యుడిషియల్ అకాడమీ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో రాష్ట్రాల్లోని జైళ్లలో రద్దీ తగ్గింపు కోసం 2020 మార్చి 23న సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వుల అమలుకు దిల్లీ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 26న ఏర్పాటుచేసిన హైపవర్ కమిటీకి ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. న్యాయమూర్తిగా సేవలందిస్తూనే ఆమె మధ్యవర్తిత్వాన్ని ప్రత్యామ్నాయ పరిష్కార మార్గంగా ప్రోత్సహిస్తున్నారు. వాతావరణం, పర్యావరణ సంరక్షణ, కుటుంబ వివాదాల పరిష్కారంలో కుటుంబ న్యాయస్థానాల పాత్రను ప్రోత్సహించడంలో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ అంశాలపై ఆమె అనేక జాతీయ, అంతర్జాతీయ సెమినార్లు, సింపోజియంలలో పేపర్లు ప్రజెంట్ చేశారు.
సిక్కిం నుంచి జస్టిస్ గోస్వామి..
1961 మార్చి 11న అసోంలోని జోర్హాట్‌లో జన్మించిన జస్టిస్ గోస్వామి 1985లో గువాహటి ప్రభుత్వ న్యాయకళాశాల నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. 1985 ఆగస్టు 16న న్యాయవాదిగా నమోదయ్యారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగం, ఉద్యోగ సేవలకు సంబంధించిన విభిన్న కేసులను వాదించారు. గువాహటి హైకోర్టులో 2011లో అదనపు న్యాయమూర్తిగా, 2012లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 అక్టోబరు 15న పదోన్నతిపై సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు 2004 డిసెంబరు 21న గువాహటి హైకోర్టు నుంచి సీనియర్ అడ్వొకేట్ హోదా పొందారు. 2011 నుంచి 2013 వరకు నాగాలాండ్ రాష్ట్ర న్యాయసేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరించారు. 2018 నుంచి రెండుసార్లు గువాహటి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు.
ఏపీ హైకోర్టుకు మరో న్యాయమూర్తి..?
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మరో న్యాయమూర్తిని పంపాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించినట్లు తెలిసింది. కలకత్తా హైకోర్టులో 2011 జూన్ 27 నుంచి శాశ్వత న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చిని ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని ప్రతిపాదించినట్లు సమాచారం.
ఇదీ చదవండీ... కేంద్ర మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ..కీలకాంశాలపై చర్చ