భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) పాదయాత్రను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని కమల దళం నిర్ణయించింది. ఆగస్టు 9న హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మి ఆలయం నుంచి మొదలై హుజురాబాద్ వరకు సాగే యాత్రను తొలిరోజే ఘనంగా ప్రారంభించాలని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులు, ప్రేమేందర్‌రెడ్డి, బంగారు శృతి, ప్రదీప్‌కుమార్‌లతో సంజయ్ సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమయ్యారు.
ఇది తొలి విడత పాదయాత్రే..
పాదయాత్ర ప్రారంభానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఆహ్వానించాలన్న విషయంపై చర్చ జరిగింది. నడ్డాకు వీలుపడకపోతే మరో కీలక జాతీయనేత లేదా ముఖ్యమైన కేంద్ర మంత్రిని ఆహ్వానించాలని నిర్ణయించినట్లు సమాచారం. పాదయాత్ర విజయవంతానికి 20 కమిటీలు ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఇది తొలివిడత పాదయాత్ర మాత్రమేనని భాజపా వర్గాల సమాచారం. మొత్తంగా నాలుగైదు విడతలుగా సంజయ్ పాదయాత్ర ఉంటుందని.. మధ్యలో పార్టీ కార్యక్రమాలు, విరామం కలుపుకొని ఏడాది పాటు ప్రజల్లోనే ఉండాలని, అన్ని జిల్లాలకు వెళ్లాలని సంజయ్ భావిస్తున్నట్లు పార్టీ నేత ఒకరు తెలిపారు.
హుజురాబాద్‌పై ప్రత్యేకదృష్టి..
రానున్న హుజురాబాద్ ఉప ఎన్నికపై సమావేశంలో చర్చించారు. మంచి మెజార్టీతో విజయం సాధించేలా పని చేయాలని సంజయ్ సహా ఇతర నేతలు అభిప్రాయపడ్డారు. రానున్నరోజుల్లో తెరాస లక్ష్యంగానే రాజకీయ వ్యూహం ఉండాలని నిర్ణయించారు. పాదయాత్రతో భాజపాను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, తెరాస వైఫల్యాల్ని ఎండగట్టాలని కమలనాథులు అనుకున్నారు. తన పాదయాత్రపై సీనియర్ నేతలు, రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలతో చర్చించి సలహాలు, సూచనలు తీసుకోవాలని సంజయ్ నిర్ణయించారు. ఈ క్రమంలో మంగళవారం ఆయన అధ్యక్షతన ఉదయం 11 గంటల నుంచి పార్టీ ముఖ్య నేతలతో, సాయంత్రం 4 గంటల నుంచి రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్‌ఛార్జులతో సమావేశాలు జరగనున్నాయి.
ఇదీ చదవండి: 'యావత్ దేశానికే గర్వకారణంగా ఉంది'