ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీ నాయకులు న్యాయవ్యవస్థను కించపరుస్తున్న విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని, న్యాయస్థానాల గౌరవాన్ని నిలబెట్టేలా వారికి గుణపాఠం చెప్పాలని సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ నాయకులు న్యాయమూర్తులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. కులం పేరుతో నిందిస్తున్నారని, అనేక రకాలుగా దూషిస్తున్నారని, బెదిరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ట్విట్టర్ తదితర సామాజిక వేదికలపై ఇటీవల న్యాయమూర్తులను కించపరుస్తూ న్యాయవ్యవస్థ గౌరవానికి భంగం కలిగించేలా సాగుతున్న పరిణామాలపై బార్ అండ్ బెంచి వెబ్‌సైట్‌లో సీఏఎన్ ఫౌండేషన్ శనివారం నిర్వహించిన చర్చావేదికలో సాల్వే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ పరిణామాలను రెండుసార్లు ప్రస్తావించారు. ప్రధానంగా ఇలా విమర్శలు చేసే వారిని రెండు రకాలుగా అభివర్ణించారు. ఒకటి పౌరసమాజం కాగా రెండో వర్గం ప్రభుత్వంలోను, రాజకీయపార్టీల్లోనూ ఉంటూ తమ మాటలతో ప్రజాభిప్రాయాన్ని మలిచేవారుగా చెప్పారు. ఈ రెండో తరహా వ్యక్తులు చేసే విమర్శలను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుందన్నారు. దీన్ని మరో రెండు విభాగాలుగా చూడాలన్నారు. ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వానికి చెందిన వారు కోర్టులను విమర్శిస్తే అది తీవ్రంగా పరిగణిస్తూనే సంస్థాపరమైన సమతౌల్యం సాధించాల్సి ఉంటుందన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అదీ మరీ తీవ్రమైన అంశంగా పేర్కొన్నారు. రాజకీయపార్టీ నాయకులు నేరుగా న్యాయమూర్తులను దూషిస్తూ గౌరవానికి భంగం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే న్యాయస్థానాన్ని నిందిస్తే ఇక ఆ వ్యవస్థకు గౌరవం ఎలా దక్కుతుందని ప్రశ్నించారు. వ్యక్తిగత పరువునష్టం కేసుల పరిశీలనకు ఒక ప్రత్యేకంగా ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి త్వరగా వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని హరీశ్ సాల్వే అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి: ఎస్ఈసీ అంశంపై సుప్రీంలో కేవియట్ పిటిషన్ దాఖలు