Seeds distribution: జూన్ నెలతో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో.. రైతులు పత్తి, మిర్చి, కూరగాయల విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేటు విత్తన దుకాణాలు కళకళలాడుతుంటే.. రైతు భరోసా కేంద్రాల్లో.. అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. సీజన్‌లో విత్తనాలు అందుబాటులో ఉంచాల్సిన ఆర్బీకేల్లో.. ఆ ఊసేలేదు. ప్రధాన వాణిజ్య పంటల విత్తనాల్లో కొన్ని రకాలకు బాగా డిమాండ్ ఉంది. ఆర్బీకేల్లో లేకపోవడం వల్ల.. అధిక ధరలకు బహిరంగ మార్కెట్లో కొనాల్సివస్తోంది.
విత్తనాల సేకరణకు ఈసారి వ్యవసాయ శాఖ కసరత్తులో బాగా జాప్యం జరిగింది. సంబంధిత విత్తన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకునే ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. పత్తి, మిర్చి, కూరగాయల విత్తనాలను మార్కెటింగ్ చేసే 22 కంపెనీలతో ఏపీ సీడ్స్ ఒప్పందం చేసుకుంది. ఆయా కంపెనీలు ఏయే రకాల విత్తనాలు అవసరమవుతాయో క్షేత్రస్థాయిలోని ఆర్బీకే సిబ్బందితో చర్చిస్తున్నారు. విత్తనాలను త్వరగా జిల్లాలకు చేర్చాలని వ్యవసాయ శాఖ కోరుతున్నా.. ఈ ప్రక్రియ పూర్తవడానికి ఎన్ని రోజులు సమయం పడుతుందో.. చెప్పలేక పోతున్నారు. గతేడాది మేలోనే విత్తనాలను రైతులకు విక్రయించారు. ఈ సారి మాత్రం ఇంకా ఆర్బీకేలకే చేరలేదు. కొన్ని రైతు భరోసా కేంద్రాలు మూసి ఉండడం వల్ల ఎవరిని ఆశ్రయించాలో రైతులకు అర్థం కావడం లేదు.
ఈ ఏడాది విత్తన సరఫరా బాధ్యతను ఏపీ ఆగ్రోస్ నుంచి ఏపీ సీడ్స్ కు మార్చడం, ఇతర సాంకేతిక అంశాల వల్ల కొంత జాప్యం జరిగింది. ఏపీ సీడ్స్ తాజాగా విత్తన కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటోంది. విత్తన కంపెనీలు ఇప్పటికే విత్తనాలను ప్రైవేటు మార్కెట్ కు తరలించడంతో … ఉన్నవాటికి పరీక్షలు నిర్వహించి అందించడానికి కొంత గడువు కావాలని కోరినట్లు తెలుస్తోంది. ఈలోగా వ్యాపారులు రైతుల్ని దోచేస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించి.. ధరలు ఇష్టారాజ్యంగా పెంచుతున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని.. వ్యవసాయ అధికారులు అంటున్నారు.
ఇవీ చదవండి: