దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం పూర్తయింది. దిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్ వైద్యుల బృందం గాంధీ ఆస్పత్రిలో రీపోస్టుమార్టం నిర్వహించారు. 4 మృతదేహాలకు మరోసారి పోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబ సభ్యుల సమక్షంలో వైద్యులు ఈ ప్రక్రియ చేపట్టారు. దీనినంతటినీ వీడియోలో నిక్షిప్తం చేశారు.
గతంలో పోస్టుమార్టం చేసిన వైద్య బృందానికి సంబంధం లేకుండా రీపోస్టుమార్టం నిర్వహించినట్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ తెలిపారు. ఈ ప్రక్రియను ఎయిమ్స్ బృందమే వీడియో చిత్రీకరణ చేసిందని చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకే రీపోస్టుమార్టం నిర్వహించామని, ఇంతకంటే ఎక్కువ రోజులు మృతదేహాలను భద్రపరచలేమని గతంలోనే కోర్టు దృష్టికి తీసుకెళ్లామని స్పష్టం చేశారు.
దిశ నిందితుల మృతదేహాలను రీపోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ప్రత్యేక అంబులెన్స్‌లో నిందితుల స్వగ్రామాలకు తరలించారు.