గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశమయ్యారు. రాజ్ భవన్లో సుమారు 40 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో.. రాష్ట్రంలో స్థానిక సంస్ధల ఎన్నికల నిర్వహణపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో జరపాలని నిర్ణయించిన ఎస్ఈసీ.. ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చి ప్రక్రియ మధ్యలోనే నిలిపివేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, పురపాలిక ఎన్నికలను కొనసాగింపునకు అనుమతి కోరినట్లు తెలిసింది.
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నందున.. రాష్ట్రంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికలు నిర్వహిస్తామని.. దీనికి అనుమతించాలని గవర్నర్‌ను కోరినట్లు సమాచారం. రాజ్యంగ నిబంధనల ప్రకారం సకాలంలో ఎన్నికలు జరపకపోతే.. స్థానిక సంస్థలకు ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన నిధులు రాని పరిస్ధితి వస్తుందని తెలిపినట్లు సమాచారం.
ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి గణనీయంగా తగ్గిందని.. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ ఇస్తోన్న రోజువారీ బులిటిన్లు, అధికారులతో జరిపిన సమావేశం వివరాలను గవర్నర్‌కు నివేదించినట్లు తెలిసింది. తాను ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నా.. ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని సహకారం అందించడం లేదని గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎస్ఈసీకి నిధులు ఇవ్వకపోవడమే కాకుండా.. ప్రస్తుత పరిస్ధితుల్లో ఎన్నికలు జరపలేమని చెబుతున్న విషయాన్ని గవర్నర్ దృష్టికి తెచ్చినట్లు తెలిసింది.
ప్రభుత్వ అధినేతలు కరోనా పేరుతో అధికారులను భయాందోళనలకు గురిచేస్తున్నారని.. ఎన్నికలు జరగకుండా అపుతున్నారని ఫిర్యాదులో తెలిపినట్లు సమాచారం. ఇప్పటికీ ఇదే అంశంపై లేఖ ద్వారా గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన ఎస్ఈసీ.. మరోమారు విషయాన్ని కూలంకషంగా వివరించినట్లు తెలిసింది. ఎన్నికల ప్రక్రియను ఆటంక పరిచేందుకు జిల్లాల పునర్విభనజన ప్రక్రియను తెరపైకి తీసుకువచ్చారని గవర్నర్ దృష్టికి తెచ్చినట్లు సమాచారం.
జిల్లాల పునర్విభజన ప్రక్రియను తాత్కాలికంగా కొంతకాలం పాటు ఆపి.. నిలిచిపోయిన ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్‌ను ఎస్ఈసీ కోరినట్లు తెలిసింది. తాను ఇచ్చిన పలు ఆదేశాలపై ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఇప్పటికే గవర్నర్‌కు లేఖ ద్వారా ఫిర్యాదు చేసిన ఎస్ఈసీ.. ఇదే అంశాన్ని మరో మారు తెలిపినట్లు తెలిసింది.
రాష్ట్రంలో రాజ్యాంగ స్పూర్తిని కాపాడుతూ.. రాజ్యాంగ బద్దంగా అమలు కావాల్సిన ఆదేశాలను అమలు పరచాలని గవర్నర్‌ను కోరినట్లు తెలుస్తోంది. సమావేశానికి సంబంధించిన అంశాలను బయటకు వెల్లడించని ఎస్ఈసీ నేరుగా తన కార్యాలయానికి వెళ్లారు. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా పరిషత్ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. సమావేశంలో గవర్నర్‌తో జరిగిన భేటీకి సంబంధించిన అంశాలు, గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను వెల్లడించే అవకాశాలున్నట్లు ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి.
ఇవీ చదవండి: