రాష్ట్రవ్యాప్తంగా రెండోదఫా పంచాయతీ ఎన్నికలకు దాఖలైన నామపత్రాల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల దాఖలు గడువు ముగియగా.. వాటన్నింటినీ క్రోడీకరించి ఎన్నికల సంఘం వివరాలు వెల్లడించింది.
రెండో దఫాలో 13 జిల్లాల్లో 20 రెవెన్యూ డివిజన్ల పరిధిలో 175 మండలాల్లో 3335 మండలాల్లో ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నెల 2 నుంచి 4 వ తేదీ వరకు 3 రోజుల పాటు నామినేషన్లను అభ్యర్థులు దాఖలు చేశారు.
మూడు రోజుల్లో కలిపి పెద్దఎత్తున అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. 3335 పంచాయతీల్లో సర్పంచి పదవులకు 19వేల 399 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 33,632 వార్డులకు 79వేల 842 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపింది.
పంచాయతీల్లో చిత్తూరు జిల్లాలో 276 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా.. ఇక్కడ అత్యధికంగా 2046 నామినేషన్లు దాఖలయ్యాయి. కడప జిల్లాలో 175 పంచాయతీలు, కృష్ణా జిల్లాల్లో 211 పంచాయతీలు ఉండగా.. రెండుచోట్ల తక్కువగా 1079 నామినేషన్లు దాఖలయ్యాయని ఎస్ఈసీ తెలిపింది. వార్డుల్లో విశాఖపట్నంలో 2584 వార్డులకు గాను అత్యధికంగా 8619 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డుల్లో తక్కువగా కడప జిల్లాలో1750 వార్డుల్లో 3492 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపింది.
ఈనెల 8న మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: 'ఇలా ఎలా జరిగిందో చెప్పండి.. నివేదికలు పంపండి'