‘రాజధాని ప్రాంతంలోని నా అసైన్డ్ భూమిని ఎవరూ బలవంతంగా తీసుకోలేదు. నేనే స్వచ్ఛందంగా అమ్ముకున్నానని మీడియాలో చెప్పినందుకే వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నాపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు’ అని ఉద్ధండరాయునిపాలేనికి చెందిన ఎస్సీ రైతు పూల రవి చెప్పారు. తన ఇంటి చుట్టూ పోలీసుల్ని తిప్పిస్తున్నారని, వారితో ఫోన్‌లు చేయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఆయన విచారణకు హాజరయ్యారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ఈ విచారణ కొనసాగింది. అనంతరం పూల రవి విలేకరులతో మాట్లాడారు.
కొనుగోలు చేసిన వారిని మా పైకి రెచ్చగొడుతున్నారు: రైతు రవి
రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని నిర్మించడం చేతకాక.. ఎస్సీ రైతులమైన తమపై దొంగలంటూ ముద్ర వేయించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. అసైన్డ్ భూములకు కూడా ప్యాకేజీ వర్తించేలా జీవో 41 ఇవ్వాలంటూ అప్పటి ప్రభుత్వాన్ని తామే కోరామని సీఐడీ అధికారులకు చెప్పినట్లు వివరించారు. ‘‘సీఐడీ విచారణకు సహకరించొద్దని ఎవరైనా మీకు చెబుతున్నారా? వివరాలు చెప్పటానికి భయపడుతున్నారా?’’ అని తనను ప్రశ్నించగా..అలాంటిదేమీ లేదని సమాధానమిచ్చానని రవి తెలిపారు. ‘‘మీ 60 సెంట్ల భూమి ఎంత ధరకు విక్రయించారు? అసైన్డ్ భూముల అమ్మకాలకు సంబంధించి ఎన్నింటిపై సాక్షి సంతకాలు చేశారు? అసైన్డ్ భూముల్ని అమ్మటం తప్పని మీకు తెలీదా?’’ అంటూ సీఐడీ అధికారులు తనను ప్రశ్నించారని చెప్పారు. ‘‘మా అసైన్డ్ భూములు మా ఆధీనంలో ఉన్నాయి. సీఆర్‌డీఏ జారీ చేసిన పత్రాలు మా పేరిటే ఉన్నాయి. వాటిని కొనుగోలు చేసిన వారిని ఆళ్ల రామకృష్ణారెడ్డి మా పైకి రెచ్చగొడుతున్నారు. రాజధానిలోని అసైన్డ్ రైతులకు భూ సమీకరణ పథకంలో 1450 గజాలు ఇస్తానని, రైతు కూలీలకు నెలకు రూ.9,500 పింఛను చెల్లిస్తానని ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. అవి నమ్మి ఓట్లేసి గెలిపించాం. ఎస్సీల పక్షపాతి అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత తొక్కేస్తున్నారు’’ అని రవి అన్నారు.
ఇదీ చదవండి: