నైరుతి రుతుపవన కాలం బుధవారంతో ముగిసింది. రాష్ట్రంలో ఈసారి అనూహ్య వర్షాలు కురవడంతో భారీ, మధ్య, చిన్న తరహా జలాశయాలు కళకళలాడుతున్నాయి. జూన్ నుంచి సెప్టెంబరు వరకు శ్రీకాకుళం మినహా మిగిలిన 12 జిల్లాల్లో సాధారణం నుంచి భారీ, అతి భారీ వర్షాలు నమోదు అయ్యాయి. దాంతో గోదావరి, కృష్ణా, వంశధారకు భారీగా వరద వచ్చింది. ఒక్క గోదావరి నుంచే 2,941 టీఎంసీల నీరు సముద్రంలో కలిసి పోయింది. కృష్ణా నదిలోని 639 టీఎంసీలు, వంశధార నుంచి 35 టీఎంసీల నీరు సముద్రుడిని చేరింది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు కీలకమైన నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాలూ నిండాయి. ఈ రెండింటిలో కలిపి కేవలం 3.194 టీఎంసీలు పట్టేంత ఖాళీ మాత్రమే ఉంది. ఇక జల వనరులశాఖ గణాంకాల ప్రకారం... రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని అన్ని మధ్యతరహా జలాశయాలకు మొత్తంగా 439.367 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యముండగా వాటిలో ప్రస్తుతం 339.415 టీఎంసీల నీరు చేరింది. డెడ్ స్టోరేజీని మినహాయిస్తే అన్నింట్లో కలిపి 636.312 టీఎంసీలను వినియోగించుకోవచ్చు.
శ్రీకాకుళంలో 26.5% లోటు
నైరుతి రుతు పవన కాలంలో రాష్ట్రమంతటా సాధారణం కన్నా 26.4% అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో సగటు వర్షపాతం 559.2 మి.మీటర్లు కాగా 706.6 మి.మీ. రికార్డయింది. అయితే... ఈసారి రాయలసీమలో అత్యధికంగా, ఉత్తరాంధ్రలో అత్యల్పంగా వర్షం కురవడం విశేషం. శ్రీకాకుళంలో 26.5% లోటుంది. అదేసమయంలో విజయనగరం, విశాఖ జిల్లాల్లో సాధారణ వర్షపాతమే నమోదవడం గమనార్హం. అన్ని జిల్లాలతో పోలిస్తే కడపలో సాధారణం కన్నా 74.9% మేర అధికంగా కురిసింది. అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనూ భారీగానే పడింది. అలాగే తూర్పుగోదావరి నుంచి చిత్తూరు వరకు ఉన్న ఏడు జిల్లాల్లోనూ సగటు కన్నా అధిక వర్షాలే కురిశాయి.
ఇదీ చదవండి: రైతు భరోసా కేంద్రాల నుంచి ఎరువుల హోం డెలివరీ ప్రారంభం