SANKRANTHI PRE CELEBRATIONS: సంప్రదాయం ఉట్టిపడేలా తెలుగులొగిళ్లలో జరిగే అతిపెద్ద పండుగ సంక్రాంతి. రాష్ట్రంలో వారం రోజుల ముందు నుంచే సంక్రాంతి శోభ సంతరించకుంది. పాఠశాలలు, కళాశాలలు, వివిధ సంఘాల అధ్వర్యంలో ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయవాడలోనూ పలుచోట్ల సంప్రదాయబద్ధంగా సంక్రాంతి వేడుకలు జరిపారు. మెుగల్రాజపురం సిద్ధార్థ కళాశాల, సంగీత పాఠాశాలలో వైభవంగా ముందుస్తు వేడుకలు నిర్వహించారు.
రంగు రంగుల రంగవల్లులు.. భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, సంప్రదాయ వస్త్రధారణతో చిన్నారులు, మహిళల ఆటపాటలు.. భోగి, సంక్రాంతి, కనుమ ప్రాశస్త్యాన్ని తెలిపే ఈ కార్యక్రమాలన్నింటికీ విజయవాడ నగరం వేదికైంది. పండుగ విశిష్ఠతను తెలిపేలా పల్లె వాతావరణాన్ని, సంస్కృతి-సంప్రదాయాలను కళ్లకు కట్టారు. భోగి మంటలు, సంక్రాంతి గొబ్బి పాటలు, కోలాట నృత్యాలు, పతంగులతో కనువిందు చేశారు. సంగీత విద్యార్థినులు వీణ వాయించి అందరినీ అలరించారు.
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలోని శ్రీ శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలోనూ ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సందేశాత్మకంగా రంగవల్లులను తీర్చిదిద్దారు. గంగిరెద్దుల విన్యాసాలు.. హరిదాసుల కీర్తనలతో భోగి మంట చుట్టూ కోలాటం ఆడుతూ విద్యార్దినులు సందడి చేశారు. విశాఖ భాజపా కార్యాలయంలో ముగ్గులు, పాలపొంగులు, గంగిరెద్దు మేళాలు, ఎడ్లబళ్లతో పండగ వాతావరణం ఉట్టిపడింది. ఒంగోలులోని మున్సిపల్ హైస్కూల్‌లో జరిగిన వేడుకల్లో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి...
SCR Special Trains: సంక్రాంతి సందర్భంగా 8 ప్రత్యేక రైళ్లు.. వివరాలు ఇలా...