Sand smuggling: తుంగభద్ర నదిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. నదికి ఒకవైపు తెలంగాణలోని జోగులంబ గద్వాల జిల్లా.. మరోవైపు ఏపీలోని కర్నూల్ జిల్లా ఉంటాయి. ఏపీ పరిధిలో ఇసుక నిల్వలు ఖాళీ కావడంతో తెలంగాణ నుంచి దొడ్డిదారిన తరలిస్తున్నారు. కర్నూల్ జిల్లా గూడురు మండలంలోని కొత్తకోట, సింగవరం, మూడుమాల, రంగాపురం వద్ద రీచులు ఉన్నాయి. అక్కడి అనుమతుల పేరుతో కొన్ని నెలలుగా జోగులంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలోని రాజోలి, గార్లపాడు, తుమ్మిళ్ల గ్రామాల పరిధిలో సుమారు 2 కిలోమీటర్ల మేర ఇసుకను తోడేస్తున్నారు. ఇందుకోసం పడవలకు మోటార్లు బిగించి ఇసుకను వెలికితీస్తున్నారు. మోటార్ల వాడకం ఎక్కువగా ఉండటంతో నీరు కలుషితమవుతోందని రైతులు చెబుతున్నారు.
రోజూ 10వేల క్యూబిక్ మీటర్ల ఇసుక తరలింపు..
తుంగభద్ర నదిపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సమాన హక్కులున్నాయి. రోజూ సుమారు 70 పడవలతో పాటు మోటార్లను ఏర్పాటు చేసుకొని ఇసుకను తరలిస్తున్నారు. నదిలో నుంచి ఒక్కో పడవతో ఆరు ట్రిప్పుల ఇసుక తరలిస్తుండగా.. ఒక్క రోజులో అన్ని కలుపుకోని 70 పడవల ద్వారా 420 ట్రిప్పుల ఇసుక తరలుతోంది. ఒక్కో ట్రిప్పులో ఒక పడవ ద్వారా మూడు టిప్పర్ల ఇసుక పడుతోంది. ఒక్కో టిప్పర్‌లో పట్టే ఇసుక 8 క్యూబిక్ మీటర్లు ఉంటుంది. అంటే ఒక్కో పడవలో మొత్తం 24 క్యూబిక్ మీటర్ల ఇసుక తరలుతోంది. అలా మొత్తం 420 ట్రిప్పుల్లో ప్రతి రోజు 10వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను అక్రమార్కులు తరలిస్తున్నారు. అంటే రోజూ సుమారుగా రూ.4 కోట్ల అక్రమ వ్యాపారం యథేచ్ఛగా జరుగుతోంది.
లోపాయికారి ఒప్పందం..
2019 సంవత్సరంలో ఏపీ, తెలంగాణకు చెందిన అధికారులు తుంగభద్ర నదిలో రెండు రాష్ట్రాల సరిహద్దులపై ఓ సమావేశం జరిగింది. అందులో ఈ రెండు రాష్ట్రాల అధికారులు నది మధ్యలో హద్దులపై స్పష్టత ఇచ్చారు. జియో ట్యాగింగ్ ద్వారా హద్దులను గుర్తించాలని నిర్ణయించారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని రెవెన్యూ, మైనింగ్, పోలీసు శాఖల మధ్య సమన్వయం కొరవడటం, పర్యవేక్షణ లేకపోవడంతో ఏపీ నుంచి తెలంగాణ భూ భాగంలోకి వచ్చి ఇసుకను భారీగా తరలిస్తున్నారు. ఓ కీలక ప్రజాప్రతినిధి ఇక్కడి భూభాగం నుంచి ఇసుకను తరలించే విధంగా లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదీ చూడండి: Train Accident: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. ఐదుగురు మృతి