ఇసుక రేవుల్లో పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బంది నిరసనలు కొనసాగుతున్నాయి. గురువారం కూడా వివిధ జిల్లాల్లోని పలు రేవుల్లో నిరసనలు తెలిపి, కొంతసేపు బిల్లింగ్ నిలిపేశారు. తమను కొత్త గుత్తేదారు సంస్థలో విధుల్లోకి తీసుకొని కొనసాగించాలని డిమాండ్ చేశారు. వీరి నిరసనలతో రీచ్‌ల్లో ఇసుక లోడింగ్‌కు అంతరాయమేర్పడింది. 2రోజులుగా నిరసనల నేపథ్యంలో లోడింగ్‌కు వచ్చే లారీల సంఖ్య తగ్గింది. మరోవైపు కొత్త గుత్తేదారు సంస్థతో సంప్రదించి పొరుగు సిబ్బందిని కొనసాగించేలా చూస్తామని జిల్లాల్లోని ఇసుక అధికారులు (డీఎస్‌వోలు) వారికి నచ్చజెబుతున్నారు.
హెచ్‌ఆర్ అదనపు జీఎంపై బదిలీ వేటు
ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)లోని మానవ వనరుల విభాగం అదనపు జనరల్ మేనేజర్ డి.జోసెఫ్‌ను మధ్యప్రదేశ్‌లోని సులేరి బొగ్గు గని ప్రాజెక్టుకు ఆకస్మికంగా బదిలీ చేశారు. గతంలో ఇసుక రేవుల్లో పొరుగు సిబ్బందిని ఓ ఏజెన్సీ ద్వారా నియమించడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. పొరుగు సేవల సిబ్బంది నిరసనలు వ్యక్తం చేస్తున్న సమయంలో ఆయన్ను బదిలీ చేయడం చర్చనీయాంశమైంది.
ఈ నెలాఖరుకు బిల్లులు క్లియర్ చేయాలి
అన్ని జిల్లాల్లో ఇసుక తవ్వకాలు, రవాణా చేస్తున్న గుత్తేదారులకు సంబంధించిన బిల్లులన్నీ ఈ నెలాఖరుకు క్లియర్ చేయాలంటూ డీఎస్‌వోలను ఆదేశాలు వెళ్లాయి. ఈ మేరకు అధికారులు బిల్లులన్నీ సిద్ధం చేస్తున్నారు.
ఇదీ చదవండి: భారత్‌బంద్: రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాసంఘాల మద్దతు