ఎస్‌ఈసీ నిర్ణయం ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామన్నారు. ఎవరిపైనా పైచేయి సాధించాలని ఎన్నికల వాయిదా కోరలేదని తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై కేంద్రం సలహా తీసుకుంటామని చెప్పారు. ఎన్నికలు, వ్యాక్సినేషన్ రెండూ ఒకేసారి నిర్వహణ కష్టమేనన్న ఆయన... ఎన్నికలు నిర్వహించి తీరాలన్న పట్టుదల వెనుక కుయుక్తులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు వైకాపా ఎప్పుడూ సిద్ధమేనని తెలిపారు. ఎన్నికల నిర్వహణ ద్వారా కరోనా మళ్లీ విజృంభించే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. ఎలాంటి ఇగో సమస్యలు లేవని... తమ ఆరాటం.. ప్రజల ఆరోగ్యం కోసమేనని చెప్పారు.
'కేంద్ర బలగాల కోసం లేఖ రాయడం విపరీత మనస్తత్వానికి సూచిక. కనిపించని వ్యక్తి ఎస్‌ఈసీని ప్రభావితం చేస్తున్నారు. ఏకగ్రీవాలు ప్రోత్సహించాలనే ప్రభుత్వం బహుమతులు ఇస్తోంది. పల్లెలు ప్రశాంతంగా ఉండాలనే గతంలో ఏకగ్రీవాలు ప్రోత్సహించారు. ఏకగ్రీవాలను ఎస్‌ఈసీ వ్యతిరేకించడం విచిత్రంగా ఉంది. ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం చివరివరకు పోరాడింది. ప్రజల కోసం చేసిన పోరాటంలో పరాజయం కూడా ఆనందమే' - సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు
ఇదీ చదవండి
పంచాయతీ ఎన్నికలు జరగాల్సిందే... మీ యుద్ధంలో మేం భాగస్వామ్యం కాబోము: సుప్రీంకోర్టు