వందల మంది పోలీసులు.. లక్షల్లో సీసీకెమెరాలు.. కోట్లలో జనాలు.. కనిపిస్తే చాలు ఎరుపెక్కిన చూపులతోనే కాల్చేసేంత ఆగ్రహం.. వీటన్నింటినీ దాటుకుని వెళ్లలేనని తెలిసిపోయిందో ఏమో.. ఇంత అత్యంత నీచమైన జీవితం బతకటం కంటే చావే శరణ్యం అనుకున్నాడేమో.. చివరికి తనకు తానుగా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు కామాంధుడు రాజు.
వేల కళ్లు వెతికాయి...
9వ తేదీ సాయంత్రం చిన్నారిని హత్యాచారం చేసి ఇంట్లో పెట్టి తాళం వేసి పారిపోయిన రాజు కోసం... 10వ తేదీ నుంచి పోలీసులు వెతకడం ప్రారంభించారు. 10న కర్మన్ ఘాట్, యాకత్పురా, ఎల్బీనగర్, ఉప్పల్ ప్రాంతాల్లో నిందితుడు రాజు పర్యటించినట్లు పోలీసులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఆ తర్వాత ఎటువైపు వెళ్లాడనేది పోలీసులు గుర్తించలేకపోయారు. నిందితుని వద్ద సెల్‌ఫోన్ లేకపోవటం కూడా పోలీసులకు ఒక పెద్ద సవాలుగా మారింది. ఎంతో టెక్నాలజీ ఉన్నా ఓ నిందితున్ని పట్టుకోకపోవటంపై పోలీసుల మీద ఒత్తిడి పెరగడంతో... రాజుపై రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు. హైదరాబాద్ పోలీసులు ఓ వ్యక్తి గురించి 10 లక్షలు పారితోషికం ప్రకటించడం... మూడు కమిషనరేట్ల పరిధిలోని పోలీసులు 24 గంటల పాటు వెతకడం ఈ మధ్య కాలంలో చోటు చేసుకోలేదు. ఆటోలు, బస్సులు, రైళ్లకు పోస్టర్లు అంటించారు. నిందితుడు రాష్ట్రం దాటిపోయినా పట్టుకునేలా పోలీసులు ప్రచారం చేశారు. మరోవైపు అన్ని చోట్ల నిందితుడి కోసం పోలీసులు వందల సంఖ్యలో గాలించారు. హైదరాబాద్ మహానగరాన్ని జల్లెడ పట్టారు. రాష్ట్ర సరిహద్దులో ముమ్మరంగా సోదాలు చేపట్టారు. రాజు కోసం రైల్వే ట్రాక్‌లపై గాలించి.. రైలు ప్రమాద ఘటనల్లో చనిపోయిన గుర్తుతెలియని మృతుల వివరాలు తెలుసుకున్నారు. శవాగారాల్లో భద్రపరిచిన మృతదేహాలను క్షుణ్ణంగా పరిశిలీంచారు. సామాజిక మాధ్యమాల్లోనూ నిందితుడి ఫోటోలు విస్తృతంగా ప్రచారం చేశారు. నిందితుడికి మద్యం సేవించే అలవాటు ఉండటంతో రాష్ట్రంలోని 2200 వైన్స్ షాపుల వద్ద మఫ్టీలో పోలీసులు నిఘా పెట్టారు. కల్లు దుకాణాల వద్ద పోస్టర్లు అంటించారు. గణేశ్ మండపాల వద్ద మైకుల్లో ప్రకటన చేశారు.
పోలీసులకు వేలలో ఫోన్లు..
పోస్టర్లలో తూర్పు మండల సంయుక్త సీపీతో పాటు... దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ డీసీపీ చరవాణీ నెంబర్లు ఉంచారు. రాష్ట్రాన్నే కాకుండా దేశంలోని పలు ప్రాంతాలను కదిలించింది ఈ ఘటన. దీనికి నిదర్శనమే... రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు, కశ్మీర్ నుంచి కూడా ఫోన్లు రావడం. రాజు పోలికలున్న వ్యక్తి తమ ప్రాంతంలో ఉన్నాడని... 15న రాత్రి కశ్మీర్ నుంచి తూర్పు మండల సంయుక్త సీపీకి ఫోన్ వచ్చింది. రెండు చేతులపై మౌనిక అనే పేరుతో పచ్చబొట్టు ఉంటే అతడే రాజు అని సంయుక్త సీపీ వాళ్లకు సూచించారు. చేతిపై పచ్చబొట్లు లేకపోవడంతో రాజు కాదని అక్కడి వాళ్లు నిర్దరించుకున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో ఇద్దరు పోలీస్ అధికారులకు వందల సంఖ్యలో ఫోన్లు వచ్చాయి. కొందరు నిందితుడి ఆనవాళ్ల గురించి ఆరా తీయడానికి ఫోన్ చేయగా... మరికొంత మంది కేసు గురించి కనుక్కోవడానికి ఫోన్ చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి గురించి సమాచారం ఇవ్వడానికి ఇంకొందరు ఫోన్ చేశారు. ఎవరి నుంచి ఏ సమాచారం వస్తుందోననే ఉద్దేశంతో పోలీసు అధికారులు అర్ధరాత్రి ఫోన్లు వచ్చినా లిఫ్ట్ చేసి సమాధానాలిచ్చారు.
పచ్చబొట్లు చూసి నిర్ధరణ...
రాష్ట్రం నలుమూలాల వెతుకున్న పోలీసులకు స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలోని నష్కల్ వద్ద రైల్వేట్రాక్ పైన మృతదేహాం ఉన్నట్టు సమాచారం వచ్చింది. స్టేషన్‌ఘన్‌పూర్ రాజారాం బ్రిడ్జి నంబరు-436 వద్ద.. అతడు సంచరించినట్లు రైల్వే కార్మికులు తెలిపారు. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడినట్లు చెప్పారు. రాజు మృతదేహాన్ని ముందుగా గమనించిన కార్మికులు... డయల్ 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు... అతడి చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా సైదాబాద్ అత్యాచార నిందితుడు రాజుగా నిర్ధరించారు. అక్కడికి ఎలా వెళ్లాడు..? ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాడు..? అనే ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని వెతికే పనిలో పోలీసులున్నారు.
రాజు మృతిపై ఎన్నో కామెంట్లు...
"పాపం పండింది. చిన్నారిని చిదిమేసిన మృగానికి కుక్క చావే గతైంది. పనిపాపను పొట్టనబెట్టుకున్న పాపాత్ముడు ఎలాంటి శిక్ష అనుభవించకుండానే సుఖంగా చనిపోయాడు.. చిన్నారి ఆత్మకు ఇప్పుడు శాంతి కలుగుతుంది.. ఇలాంటి పనులు చేసినోళ్ల కుక్కచావే పడుతుందని మరోసారి రుజువైంది.. దేవుడున్నాడు.." అంటూ సామాన్యుల నుంచి సినీస్టార్ల వరకు ఎన్నో కామెంట్లు. "నా కొడుకును పోలీసులే చంపారు". "నా భర్తను చంపి.. నన్ను, నా పాపను అనాథలను చేశారు"... అంటూ కుటుంబసభ్యుల రోధనలు.. ఇంకోవైపు సైదాబాద్ సింగరేణి కాలనీలో రాజు మరణవార్త విని సంబురాలు చేసుకున్న సందర్భాలూ ఉన్నాయి.
వరంగల్‌లోనే అంత్యక్రియలు..
వీటన్నింటి మధ్యే రాజు మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీకి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. రాజు తల్లి, ఇతర కుటుంబసభ్యులు వచ్చి... మృతదేహాం రాజుదేనని మరోసారి నిర్ధరించారు. పోస్ట్‌మార్టం పూర్తి చేసి వైద్యలు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. అనంతం వరంగల్ పోతన శ్మశాన వాటికలోనే రాజు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
సంబంధిత కథనాలు...
- Saidabad: రాజును పోలీసులే కాల్చి చంపారు : కుటుంబ సభ్యులు
- Saidabad Incident: చిన్నారిపై హత్యాచారం చేసిన మృగం చనిపోయింది: కేటీఆర్
- Saidabad incident: ఇంకా దొరకని కామాంధుడు.. కారణం అదే.. ఇవిగో సీసీటీవీ దృశ్యాలు..!
- Saidabad Incident: రాజు ఆత్మహత్య.. స్పందించిన ప్రముఖులు
- Rape On Child: అందరు అనుమానించిందే నిజమైంది.. చిన్నారిని వాడే చిదిమేశాడు..